Chandrababu Bags : చంద్రబాబు చేతికి పొలిటికల్ ఆయుధం దొరికినట్టేనా.?

Chandrababu Bags

Chandrababu Bags :  ‘నన్ను హంతకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. నిజాలు ఇప్పుడు బయటపడుతున్నాయి.. ఎన్నికల కోసం బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని నిర్లజ్జగా వాడుకున్నారు. శవరాజకీయాలకే పరాకాష్ట ఇది. ఆధారాల్నీ వైసీపీ హస్తాన్ని బయటపెడుతున్నాయి.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక వున్నది వైసీపీ నేతలే.. వైఎస జగన్ మోహన్ రెడ్డి ఈ విషయమై పెదవి విప్పాలి.. బాబాయ్ హత్య కేసుతో అబ్బాయ్‌కి సంబంధం వుంది..’ అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనమవుతోంది.

మాజీ మంత్రి నారా లోకేష్ కూడా, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుని వైసీపీ రాజకీయంగా వాడుకుందనీ, ఎన్నికల్లో రాజకీయ లబ్ది ఈ హత్య ద్వారా వైసీపీ పొందిందనీ ఆరోపిస్తున్నారు. ఇందులో నిజం లేదా.? అంటే, కొంత వుందనే చెప్పాలి. ‘నారాసుర రక్తచరిత్ర..’ అంటూ అప్పట్లో వైసీపీ అనుకూల మీడియాలో వచ్చిన కథనాలు, టీడీపీ ఇమేజ్‌ని దారుణంగా దెబ్బతీసేశాయి. టీడీపీ విజయావకాశాలు దెబ్బతినడానికి అది కూడా ఓ బలమైన కారణమే.

సరే, వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారు.? అన్నది తేల్చాల్సింది సీబీఐ, న్యాయస్థానాలు. అదెప్పడికి తేలుతుందో ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. ఎందుకంటే, ఇప్పటికే దాదాపు మూడేళ్ళ సాగతీత నడిచింది. వచ్చే ఎన్నికల నాటికి కూడా ఈ అంశం సజీవంగానే వుండబోతోంది. ఎన్నికల వరకూ ఎందుకు, ఇప్పుడు జరుగుతున్న ఈ చర్చ, వైఎస్ జగన్ సర్కారుకి పెద్ద మచ్చలా మారింది.

చంద్రబాబు (Chandrababu Bags )హయాంలోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినా, అది సరిగ్గా ఎన్నికల సమయం. అంటే, అప్పటికి చంద్రబాబుది ఆపద్ధర్మ ప్రభుత్వం లాంటిదే. సో, వైసీపీ ఇప్పుడెంత ఎదురుదాడి చేసినా ఉపయోగం లేదు. ఈ కేసు విషయమై సునీతారెడ్డిని వైసీపీ పట్టించుకోకపోవడం ఇన్ని అనర్ధాలకూ కారణంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఆమె కూడా, తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను పట్టించుకోలేదనే అంటున్నారు.

ఎలా చూసినా, చంద్రబాబుకి రాజకీయంగా ఆయుధాన్ని వైసీపీనే అందించినట్లయ్యింది. ఆ ఆయుధంతో ఆయన వైసీపీ మీద రాజకీయంగా వేటు వేస్తారా.? ఏమో, వేచి చూడాల్సిందే.