బురద రాజకీయం మొదలెట్టిన చంద్రబాబు.!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించడం షురూ చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రజలు కష్ట కాలంలో వున్నప్పుడు వారిని పరామర్శిస్తే, అది మంచి విషయమే.. వాళ్ళని అభినందించాల్సిందే.

అయితే, అధికారంలో వున్నప్పుడు ప్రజల సాధకబాధకాల్ని పట్టించుకోని చంద్రబాబు, ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చినప్పుడు మాత్రం.. ప్రజల కష్టాలు గుర్తెరిగేసి.. ఇలాంటి సందర్భాల్లో నిఖార్సయిన బురద రాజకీయాలు చేసేస్తుంటారు. ఇది చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య.

బాధితుల్ని పరామర్శించడాన్ని తప్పు పట్టలేం. ప్రభుత్వం, బాధితుల్ని ఆదుకోవాలని కోరడాన్నీ తప్పు పట్టలేం. బాధిత ప్రజలకు ఏ స్థాయిలో ప్రభుత్వం నుంచి సాయం అందినా అది తక్కువే అవుతుంది. వారి కష్టం అలాంటిది మరి.

అయితే, హెలికాప్టర్లలో తిరిగి.. ఆ తర్వాత ప్రజల్ని పట్టించుకోలేదంటూ చంద్రబాబు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడం హాస్యాస్పదమే. అధికారంలో వున్నప్పుడు చంద్రబాబు కూడా హెలికాప్టర్లలోనే తిరిగారు.

వరద నష్టం అంచనా కోసం ఏరియల్ సర్వే చేయడం అనేది ముఖ్యమంత్రుల విధి. అలా ఏరియల్ సర్వే చేసి, నష్టాన్ని అంచనా వేసి.. దానికి తగ్గట్టుగా బాధితుల్ని ఆదుకునేందుకు ప్రణాళికలు రచిస్తారు అధికారంలో వున్నవారు. ఆ విషయం చంద్రబాబుకి తెలియనిది కాదు. కానీ, వరద నేపథ్యంలో బురద రాజకీయం చెసెయ్యాలి. పైగా, స్థానిక ఎన్నికల్లో దెబ్బ తిన్నాక.. రాత్రికి రాత్రి పాపులారిటీ పెంచుకోవాలంటే ఇలాంటి రాజకీయాలు చెయ్యాలని చంద్రబాబుకి తెలిసినంతగా ఇంకెవరికి తెలుస్తుంది.?