టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రస్తుతం ఎక్కువగా ఫోకస్ ఏపీ మీదనే పెట్టారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన బాధను ఇంకా చంద్రబాబు మరిచిపోలేదు. ఆ బాధను అలాగే పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో గెలవాలన్న కసితో ఏపీ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. దీంతో తెలంగాణను మరిచిపోయారు. అసలు అక్కడ పార్టీ ఉందా? లేదా? అనే అనుమానం వస్తోంది.
తాజాగా తెలంగాణ నుంచి టీడీపీ తమ్ముళ్లు చంద్రబాబుకు లేఖల మీద లేఖలు రాస్తున్నారట. సార్.. మీరు హైదరాబాద్ లోనే ఉంటున్నా… తెలంగాణ రాజకీయాలను పట్టించుకోవడం లేదు. కనీసం పార్టీలో ఉన్న నేతల గురించి కూడా ఆలోచించడం లేదు. తెలంగాణలో పార్టీలో మార్పులు చేర్పులు చేయడం లేదు.. ఇలాగే ఉంటే త్వరలోనే తెలంగాణలో పార్టీ కనుమరుగవడం ఖాయం.. అంటూ చంద్రబాబు లేఖలు రాస్తున్నారట.
2014 ఎన్నికల్లో టీడీపీకి తెలంగాణలో కాస్త మెరుగ్గానే సీట్లు వచ్చాయి. కానీ.. 2018 ఎన్నికల్లో అయితే టీడీపీ తెలంగాణలో బొక్కబోర్లా పడింది. తెలంగాణలో టీడీపీ ఓట్ల శాతం పూర్తిగా పడిపోయింది. ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా టీడీపీ తెలంగాణలో గెలుచుకోలేకపోయింది.
అయినప్పటికీ.. మీకు నేనున్నాను.. అంటూ చంద్రబాబు తెలంగాణ టీడీపీ నాయకులకు భరోసా ఇస్తూ వస్తున్నారు. పార్టీలో మార్పులు చేయాలని భావించారు. దాని కోసం కసరత్తులు కూడా ప్రారంభించారు కానీ.. అది కుదరలేదు.
ఏడేళ్ల నుంచి తెలంగాణకు అధ్యక్షుడిగా ఎల్ రమణ కొనసాగుతున్నారు. ఆయన తెలంగాణ అధ్యక్షుడు అయినప్పటి నుంచీ పార్టీ పరిస్థితి ఏం బాగా లేదని.. ఆయనను మార్చాలని సీనియర్ నాయకులు చంద్రబాబుకు లేఖలు రాస్తున్నారు. పార్లమెంటరీ పార్టీ ఇన్ చార్జులను కూడా మార్చాలంటూ చంద్రబాబును కోరుతున్నారు.
అసలే ఏపీలో అధికారం పోయి బాధలో ఉన్న చంద్రబాబు ఇప్పుడు తెలంగాణను పట్టించుకునే స్థితిలో ఉన్నారా? అనేదే పెద్ద ప్రశ్న. ఇప్పుడు తెలంగాణ టీడీపీలో మార్పులు చేసినా వచ్చే ఫైదా ఏంటి? ఒకవేళ మార్పులు చేసినా పెద్దగా ప్రయోజనం ఉంటుందా? అని చంద్రబాబు ఆలోచిస్తున్నారేమో అని వార్తలు వస్తున్నాయి.
ఒకవేళ తెలంగాణ టీడీపీలో మార్పులు చేయకపోతే మాత్రం తెలంగాణలో పార్టీ మరింత నష్టపోతుందని.. నేతలు చంద్రబాబుకు చెబుతున్నారట. చూద్దాం.. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల మీద మళ్లీ ఫోకస్ పెడతారా? మార్పులు చేస్తారా? అని..