పూర్తిగా ‘జీరో’ అయిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు.!

జాతీయ రాజకీయాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి చాలామంది సన్నిహితులుండేవారు. ఔను, ఎందుకంటే అది ఒకప్పుడు. ఇప్పుడాయనకు జాతీయ రాజకీయాల్లో ‘స్నేహితులు’ అనదగ్గరవారెవరూ దాదాపుగా లేరు. రాజకీయాల్లో అంతే. చేతిలో వున్న ప్రజా ప్రతినిథుల సంఖ్యని బట్టి, ఆయా రాజకీయ పార్టీల ‘బలం’ అనేది కనిపిస్తుంటుంది. తెలంగాణలో నిర్వీర్యమైపోయిన టీడీపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వెంటిలేటర్ మీదుంది.

వాస్తవానికి ఇదంతా చంద్రబాబు స్వయంకృతాపరాధం. వ్యూహాత్మక తప్పిదాలతో, టీడీపీని చంద్రబాబే స్వయంగా దెబ్బ తీసుకున్నారు. లేకపోతే, టీడీపీకి ఇప్పుడు ఈ దుస్థితి వచ్చి వుండేది కాదు.!

రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా సందడి నెలకొంది. ఎవరు బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తారు, ఎవరు బీజేపీయేతర అభ్యర్థికి మద్దతిస్తారు.? అన్నదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. చిత్రమేంటంటే, టీడీపీకి ముగ్గురు లోక్ సభ సభ్యులు, కొందరు రాజ్యసభ సభ్యులున్నా, 20 మందికి పైగా ఎమ్మెల్యేలున్నా, రాష్ట్రపతి ఎన్నికల్లో అసలు టీడీపీని ఎవరూ పరిగణనలోకి తీసుకోవడంలేదు.

మమతా బెనర్జీతో ఒకప్పుడు చంద్రబాబుకి సన్నిహిత సంబంధాలుండేవి. నరేంద్ర మోడీతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఒకప్పుడు వుండేవి. కాంగ్రెస్ పార్టీతో సంగతి సరే సరి. వేరే రాజకీయ పార్టీలతోనూ చంద్రబాబు గతంలో సన్నిహితంగా వున్నారు.. జాతీయ స్థాయిలో. అయితే, అలాంటివారెవరూ ఇప్పుడు చంద్రబాబుని ఓ రాజకీయ పార్టీ అధినేతగా, పాత మిత్రుడిగా పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం.

చంద్రబాబు రాజకీయాల్లో బిగ్ జీరో అయిపోయారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?