కాళ్లా వేళ్లా పడైనా సరే బీజేపీతో కలవాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్ని అందుకు మంచి అవకాశంగా భావిస్తున్నారు. బీజేపీకి దగ్గరయ్యేందుకు ఇది అంది వచ్చిన అవకాశంగా భావిస్తున్న బాబు ఆ దిశగా అప్పుడే చక్రం తిప్పడం మొదలుపెట్టారట.
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి బీజేపీని ప్రసన్నం చేసుకోవాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. చంద్రబాబును దగ్గర చేర్చుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని బీజేపీ కూడా హైదరాబాద్‌లో ఉన్న పరిస్థితిని బట్టి ఈసారికి కలుపుకోవాలని భావిస్తుందట. 150 డివిజన్లలో 50 నుంచి 60 డివిజన్లలో తమకు గట్టి పట్టు ఉందని, మిగిలిన చోట్లా అంతోఇంతో తమ ప్రభావం ఉంటుందని చంద్రబాబు రాయబారాలు పంపిస్తున్నారట.
ఇది కొంత నిజమే అనే భావనలో ఉన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టీడీపీతో పొత్తుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన ఊపులో హైదరాబాద్ కార్పొరేషన్‌లోనూ కాషాయ జెండా ఎగురవేయాలని తపన పడుతున్న బీజేపీ ఈ టైమ్‌లో చంద్రబాబు తమ వెంట ఉంటే కొంత బాగుంటుందనే అభిప్రాయంలో ఉందని సమాచారం.
అదే టైమ్‌లో కొందరు నాయకులు గ్రేటర్ ఎన్నికల్లో గెలిచినా అది తనవల్లేనని చంద్రబాబు డప్పు కొడతాడని, అతనికి దూరంగా ఉండడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. కానీ ఓట్ల సమీకరణ ప్రకారం టీడీపీ తమకు తోడుగా ఉంటే టీఆర్‌ఎస్‌ను గట్టిగా ఢీకొట్టవచ్చని బీజేపీ ముఖ్య నాయకులు నమ్ముతున్నారు. దీంతో టీడీపీ–బీజేపీ పొత్తుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏపీలోనూ బీజేపీకి దగ్గరవచ్చని, ఆ తర్వాత ఢిల్లీ పెద్దలకు దగ్గరవ్వాలని చంద్రబాబు ప్లాన్ వేశారు. ఇప్పటి వరకూ తనను దగ్గరకు రానీయని బీజేపీ ఈ దెబ్బకు కలుపుకోక తప్పదని, ఈ మాత్రం సందు తనకు దొరికితే మోడీ, అమిత్‌షాలను కూడా మేనేజ్ చేసేయ వచ్చని ఆయన భావిస్తున్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ కొద్దిగా తనకు సపోర్ట్ చేస్తే ఏపీలో జగన్‌ను ఎదర్కోవడం తేలికవుతుందని, తాను కూడా కేసుల్లో ఇరుక్కోకుండా తప్పుకోవచ్చనేది విజనరీ చంద్రబాబు యోచనట.. ఆయన కల ఎంతవరకూ నెరవేరుతుందో మరి..