ఏపీ మూడు రాజధానుల అంశంపై కేంద్రం మరోసారి స్పందించింది. ఆంధ్ర ప్రదేశ్ మూడు రాజధానుల అంశంపై కేంద్రం చాలాసార్లు స్పందించిన విషయం తెలిసిందే. ఈసారి ఫైనల్ గా స్పందించిన కేంద్రం.. మూడు రాజధానుల అంశంపై ఏం తేల్చిందో తెలుసుకుందాం పదండి..
ఏపీ రాష్ట్ర రాజధాని విషయంలో తమ జోక్యం ఏమాత్రం ఉండబోదు.. అని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని చట్టంలో ఎక్కడా పేర్కొనలేదు.. అని కేంద్ర హోంశాఖ తెలిపింది.
దీనికి సంబంధించి.. ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ అనుబంధ పిటిషన్ ను దాఖలు చేసింది. సెక్షన్ 13 ప్రకారం.. క్యాపిటల్ అంటే ఒకటే కాదు.. అని పేర్కొన్నది.
అమరావతిలో హైకోర్టు ఉన్నంత మాత్రాన.. అమరావతినే రాజధానిగా చెప్పలేమని.. అప్పటి ప్రభుత్వం హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నది.
ఏపీకి మూడు రాజధానులు ఉండాలా? ఒక్క రాజధానే ఉండాలా? అనే విషయంపై తుది నిర్ణయం ఏపీ ప్రభుత్వానిదే.. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోదు.. అంటూ కేంద్రం స్పష్టం చేసింది.
దీనికి సంబంధించి పిటిషనర్ దోనే సాంబశివరావువి కేవలం అపోహలే అని కేంద్రం హోంశాఖ వెల్లడించింది. ఒకవేళ రాజధానికి అవసరమైతే ఆర్థిక సాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందంటూ తెలిపింది.
ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు ఏపీ హైకోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రం కూడా పలుమార్లు అఫిడవిట్లు దాఖలు చేసింది. ఏ రాష్ట్రమయినా సరే.. రాజధానులను నిర్ణయించుకునే అధికారం.. వాటికే ఉంటుందంటూ కేంద్రం స్పష్టం చేసింది. తాజాగా దాఖలు అయిన అఫిడవిట్ లోనూ కేంద్రం ఇదే విషయాన్ని చెప్పింది.