Central Budget : ఏడేళ్ళుగా ఒకటే షాక్.! బడ్జెట్ పేరుతో మాయమాటలు చెప్పడం తప్ప, బీజేపీ మార్కు బడ్జెట్ పట్టుకుని నరేంద్ర మోడీ ప్రభుత్వం, దేశాన్ని ఉద్ధరించింది ఏమీ లేదు.! ఇది జనం మాట. ఆంధ్రప్రదేశ్ విషయంలో అయితే, మరీ దారుణమైన మొండిచెయ్యి ప్రతిసారీ కనిపిస్తోంది.
ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు, ఏపీ రాజధాని నిర్మాణం, దుగరాజపట్నం పోర్టు, విశాఖ రైల్వే జోన్, కడప స్టీలు ప్లాంటు.. ఇలా చెప్పుకుంటూ పోతే, పాత లిస్టులో ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తవలేదు. ఏడున్నరేళ్ళుగా ఒకటే తంతు. బడ్జెట్లు వస్తున్నాయ్.. వెళుతున్నాయ్. అసలు విభజన చట్టం ఒకటుందన్న విషయాన్నే కేంద్రంలోని మోడీ సర్కారు మర్చిపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
‘బడ్జెట్ బాగుంది.. బహు బాగుంది..’ అంటూ ఏపీ బీజేపీ నేతలు షరామామూలుగానే హంగామా షురూ చేశారు. రైల్వే జోన్ ప్రకటించారు.. అదెప్పటినుంచి అమల్లోకి వస్తుంది.? అంటే, దానికి బీజేపీ దగ్గర సమాధానం లేదంటే, రాష్ట్రాన్ని బీజేపీ ఏ స్థాయిలో ఉద్ధరించేసిందో అర్థం చేసుకోవచ్చు.
చిత్రమైన విషయమేంటంటే కేంద్రంలో భాగస్వాములుగా వుండి, గతంలో కేంద్రాన్ని వెనకేసుకొచ్చారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. ‘మేం కేంద్రంలో భాగస్వాములం కాదు..’ అని ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారుగానీ, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారు.. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి అవసరమైన ప్రతిసారీ వైసీపీ తరఫున సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, తెలంగాణ కూడా తాజా బడ్జెట్ తీరుపై విస్మయం వ్యక్తం చేస్తోంది. ఇదేం బడ్జెట్.? దశ దిశ లేని బడ్జెట్టుతో దేశాన్ని ఎలా నడుపుతారంటూ తెలంగాణ ప్రశ్నిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకే కాదు, ఈసారి అన్ని రాష్ట్రాలకూ కేంద్రం సమ అన్యాయం చేసింది. అదే కొసమెరుపు.