ఏపీకి రూ.2167.20 కోట్లు .. తెలంగాణ‌కి రూ.1703.56 కోట్లు విడుదల

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జీఎస్టీ అమలుతో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న నష్టాల భర్తీకి పరిహారం విడుదల చేసింది. జీఎస్టీ అమలు వల్ల పలు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న నష్టాలను భర్తీ చేయడానికి మరోసారి పరిహారం విడుదల చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. “స్పెషల్ బారోయింగ్ ప్లాన్” లో భాగంగా రాష్ట్రాలకు ఇప్పటివరకు రూ.95వేల కోట్ల పరిహారం విడుదల చేశారు.

నేడు తెలంగాణ‌ రాష్ట్రానికి రూ.1703.56 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.2167.20 కోట్ల పరిహారం విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. 16వ విడతగా అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 5వేల కోట్లు విడుదల చేసినట్టు ప్రకటనలో పేర్కొంది. కాగా, కరోనాతో కుదేలైన రాష్ట్రాలను ఆదుకోవాలని రాష్ట్రాలను కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి.

బకాయిలు విడుదల చేయాలంటూ పలు సార్లు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి. దీంతో.. ఇవాళ 16వ విడతగా రూ .5,000 కోట్లు విడుదల చేసింది కేంద్రం.. వీటిలో 23 రాష్ట్రాలకు రూ .4,597.16 కోట్లు విడుదల కాగా.. రూ .402.84 కోట్లు 3 కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్, పుదుచ్చేరికి విడుదల చేశారు. మిగతా ఐదు రాష్ట్రాలు.. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్ మరియు సిక్కింలకు జీఎస్టీ అమలు కారణంగా ఆదాయంలో అంతరం లేనికారణంగా నిధులు విడుదల చేయలేదు.