కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుస్తుంది. ఈ సమయంలో యూకే ప్రభుత్వం ఫైజర్ వ్యాక్సిన్ కి అనుమతి ఇచ్చింది. దీనితో బ్రిటన్ తో పాటుగా అమెరికా సహా పలు దేశాల్లో వాడకానికి అనుమతి పొందిన ఫైజర్ వ్యాక్సిన్ కి ఇండియాలో చుక్కెదురు కానుంది. ఈ వ్యాక్సిన్ వాడకానికి అనుమతి ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఫైజర్ వ్యాక్సిన్ ధర అధికంగా ఉండటం ( దాదాపుగా రూ. 2,728), ఈ వ్యాక్సిన్ ను మైనస్ 70 నుంచి 90 డిగ్రీల ఉష్ణోగ్రతలో స్టోర్ చేయాల్సి వుండటమే ఇందుకు కారణమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఫైజర్ వ్యాక్సిన్ ధర, నిల్వ సమస్యలు, పంపిణీ వ్యయాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొనుగోలుకి విముఖత చూపనున్నట్లు ఫార్మా వర్గాలు అభిప్రాయపడ్డాయి.
ఫైజర్ వ్యాక్సిన్ ను ప్రస్తుతం యూకే, బెహ్రయిన్, కెనడాల్లో వినియోగిస్తుండగా, యూఎస్ ఎఫ్డీయే సైతం అనుమతులు మంజూరు చేయగా, నేటి నుంచి ప్రజలకు టీకా ఇవ్వడం ప్రారంభమైంది. యూఎస్ లో వ్యాక్సిన్ నిల్వ కోసం కోల్డ్ స్టోరేజ్ లను తయారు చేసి, స్వయంగా వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. కానీ, ఆ పరిస్థితి ఇండియా కి లేదు.