కోవిడ్ కష్టం: సెలబ్రిటీలకే దొరకట్లేదు.. సామాన్యుల పరిస్థితేంటి.?

Celebrities Are Worrying, What About Common Man

Celebrities Are Worrying, What About Common Man

ఆమె ఓ పేరున్న సినీ నటి.. తన సోదరుడ్ని కోల్పోయింది. మరో హీరోయిన్ కూడా తన సోదరుడ్ని కరోనా కారణంగా కోల్పోవాల్సి వచ్చింది. ఇటీవల వరుసగా చోటు చేసుకున్న రెండు విషాద ఘటనలివి. సెలబ్రిటీలకే ఇలాంటి పరిస్థితి అయితే, సామాన్యుల పరిస్థితేంటి.? లక్షలు వెచ్చించగలిగేవాళ్ళకే ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకడంలేదు అత్యవసర పరిస్థితి అయినా. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా, తమ బంధువుల కోసం ప్లాస్మా కావాలంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకుంటున్నారు.. అలాంటివారికి కొన్ని సందర్భాల్లో సాయం కూడా అందుతోంది. అదే సమయంలో, సెలబ్రిటీలు సామాన్యుల కోసం కూడా పనిచేస్తున్నారు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా.. సోషల్ మీడియా హ్యాండిల్స్.. బిజీగా వుంటున్నాయి సెలబ్రిటీలకు సంబంధించి. ఆ హీరో, ఈ హీరోయిన్.. అని లేదు. దర్శకులు, నిర్మాతలు.. ఇలా అందరూ ఆపద వేళ సామాన్యుల్ని ఆదుకుంటూనే వున్నారు.

ఈ విషయంలో సినీ పరిశ్రమను అభినందించి తీరాల్సిందే. అయితే, ఇంత కష్టం వచ్చినా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. మరీ ముఖ్యంగా ప్లాస్మా, రెమిడిసివిర్ వంటి మందులు, ఆక్సిజన్ విషయంలో.. ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. అవి నల్ల బజారుకి తరలిపోతోంటే, ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయన్న విమర్శలు లేకపోలేదు. రెమిడిసివిర్ లాంటి ఇంజెక్షన్లలో ఏకంగా సాధారణ సెలైన్ వాటర్ నింపేసి విక్రయించేస్తున్నారంటే, పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు. ఆక్సిజన్ కూడా నల్ల బజారులో యధేచ్ఛగా లభ్యమవుతోంది. ఫలానా చోట ఫలానా మెడిసిన్ దొరుకుతోంది.. ఆక్సిజన్ కోసం ఇలా చేయండి.. ప్లాస్మా కోసం వీరిని సంప్రదించండి.. అని సెలబ్రిటీలు సూచిస్తుండడాన్ని అభినందించాల్సిందే. కానీ, ఈ తరహా వేదికల్ని ప్రభుత్వాలు సమర్థవంతంగా ఏర్పాటు చేయాల్సి వుంది.. అదీ వీలైనంత ఎక్కువగా.