తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఢిల్లీకి వెళ్ళారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో సమావేశమవుతారు. ఇందుకోసం ఐదుగురు సభ్యుల బృందానికి రాష్ట్రపతి కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్ ఖరారయ్యింది కూడా. మరోపక్క, పలువురు కేంద్ర మంత్రుల్ని చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ బృందం కలవనుందనే ప్రచారం జరుగుతోంది.
ఇంతకీ, ఢిల్లీ నుంచి చంద్రబాబు ఆశించిన ‘వార్త’ వస్తుందా.? అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి ఫిర్యాదు చేసేస్తే, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే దిశగా కీలక నిర్ణయాలు జరిగిపోతాయా.? అంటే, ఆ ఛాన్సే వుండదు.
రాష్ట్రంలో శాంతి భద్రతల విషయమై ఎప్పటికప్పుడు కేంద్రానికి సమాచారం వుంటుంది. పరిస్థితి శృతిమించితే, కేంద్ర హోం శాఖ తక్షణం స్పందిస్తుంటుంది. ఆ పరిస్థితులు రాష్ట్రంలో లేవు. ఇక, టీడీపీ చేసే ఫిర్యాదుని రాజకీయ కోణంలోనే చూడాల్సి వస్తుంది.
టీడీపీ బృందం రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తే, రాష్ట్రపతి ఆ ఫిర్యాదుని స్వీకరించి, కేంద్ర హోం శాఖకు రాష్ట్రంలో పరిస్థితులపై ఆరా తీయమని ఆదేశించే అవకాశం వుంటుంది. అంతకు మంచి, రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు చంద్రబాబు కోరుకుంటున్న రాజకీయ మార్పులైతే జరిగిపోవు.
ఇక, కేంద్ర మంత్రుల్ని టీడీపీ కలిసే విషయమై ఏపీ బీజేపీ నేతల వద్ద ఖచ్చితమైన సమాచారం లేదు. దానర్థం.. కేంద్ర మంత్రులెవరూ ఇంతవరకు టీడీపీ బృందానికి అపాయింట్మెంట్లు ఇచ్చినట్లు కనిపించడంలేదనే. ఒకవేళ కేంద్ర మంత్రుల్ని టీడీపీ బృందం కలవకపోతే.. చంద్రబాబు ఢిల్లీ యాత్ర.. ఖర్చు దండగ వ్యవహారమే అవుతుంది.