2019 ఎన్నికల్లో వచ్చిన ఓటమిని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా సీబీఎన్ ఇప్పటికి ఒప్పుకోలేకపోతున్నారు. జగన్ ఈ రాష్ట్రానికి సరైన ముఖ్యమంత్రి కాదని నిరూపించడానికి చంద్రబాబు నాయుడు ఎప్పటి నుండి ప్రయత్నిస్తున్నారు కానీ సరైన సమయం రావడం లేదు. అయితే ఇప్పుడు వచ్చిన తిరుపతి ఉప ఎన్నికల అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను ఓడించి, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన పాలన తప్పని నిరూపించాలని బాబు ప్రయత్నిస్తున్నారు. అయితే అది సులువు కాదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
రాష్ట్రంలో సార్వత్రిక సమరం ముగిసిన ఏడాదిన్నర తర్వాత వస్తున్న తొలి ఎన్నిక, పైగా తన సొంత జిల్లాలో వస్తున్న ఉప ఎన్నిక కావడంతో చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఏడాదిన్నరగా వైసీపీ ప్రభుత్వంపై తాను ఏయే ఆరోపణలు చేస్తున్నారో.. అరాచక పాలన, తుగ్లక్ పాలన, ఫేక్ సీఎం.. అంటూ.. జగన్ కేంద్రంగా ఎలా విరుచుకుపడుతున్నారో.. వాటిని నిజం చేయాల్సిన తరుణం.. ఇప్పుడు ఎన్నికల రూపంలో చంద్రబాబుకు వచ్చింది. మరీ ముఖ్యంగా అమరావతి రాజధానికి రెఫరెండంగానే ఆయన ఎన్నికలను తీసుకుంటున్నట్టు టీడీపీ వర్గాలు కూడా చెబుతున్నారు. ఈక్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు తిరుపతి ఉప పోరును ప్రతిష్టాత్మకంగా అదేసమయంలో సవాలుగా కూడా తీసుకున్నారు.
ఈ క్రమంలోనే వ్యూహం పై వ్యూహంతో ముందుకు సాగుతున్నారట చంద్రబాబు. ఎన్నికల నోటిఫికేషనే లేకపోయినా అభ్యర్థిని ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక ఉప పోరులో టీడీపీకి గత ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మే అభ్యర్థిగా గతయ్యారు. ఇక, ప్రచార బాధ్యతలను మహిళల్లో పరిటాల సునీత, వంగలపూడి అనితలకు అప్పగించారనే ప్రచారం ఉంది. ఇక, సినీ రంగం నుంచి బాలయ్య రంగంలోకి దిగుతారు. డిజిటల్ ప్రచారానికి ఇప్పటికే చంద్రబాబు తనయుడు లోకేష్ రెడీ అయ్యారు. ఇక, ఉప ఎన్నిక ప్రచారం చివరి రెండు రోజలు తానే స్వయంగా ప్రజల్లోకి వెళ్లేలా చంద్రబాబు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఇలా తాను గెలవడం అనే దానికంటే కూడా జగన్ ను ఓడించాలనే తపనతో చంద్రబాబు నాయుడు ఉన్నారు. మరీ జగన్ రెడ్డిని ఓడించడానికి బాబువేసిన వ్యూహాలు ఎంత వరకు పని చేస్తాయో వేచి చూడాలి.