మాజీ మంత్రి, వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ రెండవ దశ విచారణను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఈ విచారణ మొదలైంది. వివేకా కుమార్తె డిమాండ్ చేయడంతో కేసును సీబీఐకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి దశ విచారణలో సుమారు రెండు వారాల పాటు పలువురిని విచారించిన సీబీఐ అధికారులు విచారణ వివరాలను బయటకు తెలియనీయకుండానే ఢిల్లీ వెళ్ళిపోయారు. ఇక తాజాగా రెండో దశ విచారణ మొదలైన రెండు రోజులకే సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో ఏముందనే వివరాలను మాత్రం బయటకు రానివ్వలేదు. ఇంకో రెండు మూడు రోజుల్లో పిటిషన్ కవర్ ఓపెన్ చేస్తే అప్పుడే సీబీఐ ఏం చెప్పదలుచుకుందో బయటపడుతుంది.
సీబీఐ కేసును స్వాధీనం చేసుకున్నప్పుడు సిట్ అధికారులం నుండి ప్రాథమిక విచారణకు సంబంధించిన అన్ని వివరాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును రీకన్ స్ట్రక్ట్ చేయడం, పలువురిని విచారించడంతో పలు కీలక సమాచారం సంపాదించి ఉండొచ్చని చెబుతున్నారు. ఇక ఈ కేసులో మొదటి నుండి వివేకా కుటుంబ సభ్యుల పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. వివేకా కుమార్తె సైతం కుటుంబంలో ప్రముఖులు ఉన్నా ఎవ్వరి సహకారం అండట్లేదని అసహనం వ్యక్తం చేసిన సంధర్భాలున్నాయి. వివేకా మరణించిన మొదటి గంటల్లో ఆయన గుండెపోటుతో మరణించారని, బాత్రూంలో కాలుజారి పడ్డారని రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. కానీ చివరికి వివేకాది సహాజ మరణం కాదని హత్యని తేలడంతో అనేక అనుమానాలు బయలుదేరాయి.
ఈ నేపథ్యంలో సీబీఐ మొదటి దశ విచారణలో ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు రాబట్టింది, తాజాగా కోర్టులో సమర్పించిన పిటిషన్లో ఏముందోననే ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది. సీబీఐ అధికారులు ఒకవేళ ఎవరైనా ప్రముఖుల్ని, ప్రత్యేక వ్యక్తులని విచారణ చేయాలని అనుమతులు కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారా అనే అనుమానం కలుగుతోంది. మరి సీబీఐ సమర్పించిన పిటిషన్లో ఏముంది, అది ఎవరి మెడకు చుట్టుకోనుంది, అందులో ఎవరి పేర్లనైనా ప్రస్తావించబడ్డాయా అనేది తెలియాలంటే ఇంకో రెండు మూడు రోజులు ఎదురుచూడాల్సిందే.