మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ సమీప బంధువు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. వివేకా కుమార్తె సునీత సీబీఐ విచారణ డిమాండ్ చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు రాగా కేసును సీబీఐకు అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. మొదటి కదలికగా హత్య జరిగిన పులివెందులలో సమగ్ర విచారణ చేపట్టారు. రెండు వారాల పాటు జరిగిన ఈ మొదటి దశ విచారణలో వివేకా కుమార్తెతో పాటు శంకర్ రెడ్డి, సస్పెండ్ అయిన సీఐ శంకరయ్యను, పీఏ కృష్ణారెడ్డి, పనిమనిషి లక్ష్మీదేవితో పాటు మరో పది మంది అనుమానితులను విచారించారు.
ఇప్పుడు రెండవ దశ విచారణకు సిద్దమయ్యారు. విచారణ కోసం ఢిల్లీ నుండి పులివెందులకు చేరుకున్న టీమ్ ప్రభుత్వ ఆర్ అండ బీ గెస్ట్ గౌస్ కు చేరుకున్నారు. త్వరలోనే సెకండ్ స్టేజ్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టనున్నారు. ఈ దశలో ఇంకొందరు అనుమానితులను విచారించనున్నారు. ఈ విచారణలో పలు కీలక సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంది. గత విచారణలో వివేకా ఇంట్లో కేసును రీకన్ స్ట్రక్ట్ చేయడం జరిగింది.
ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు సిట్ అధికారుల నుండి సీబీఐ ప్రాథమిక విచారణ వివరాలను స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగే నాటికి అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అప్పట్లో సీబీఐ వరకు వెళ్ళకుండా సిట్ విచారణకు మాత్రమే ఆదేశించారు. ఆతర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సైతం సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో వివేకా కుమార్తె కోర్టులో పిటిషన్ వేసి మరీ సీబీఐ విచారణ కోరారు. మరణించింది అధికారంలో జగన్ బాబాయి కాబట్టి కేసు ఎలాంటి మలుపు తిరుగుతుంది, నిందితులుగా ఎవరెవరు తేలుతారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.