ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా అంతర్వేది ఘటనపై చర్చ నడుస్తోంది. అంతర్వేది రథం దగ్ధం వెనుక పెద్ద కుట్ర ఉందని అన్ని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఓవైపు రథం ఎలా దగ్ధం అయిందనే విషయం తెలియకముందే ప్రతిపక్షాలు దానిపై రాజకీయం చేయడం మొదలు పెట్టేశాయి. దీక్షలు గట్రా ప్రారంభించాయి. ఛలో అంతర్వేది అని కూడా ముందు పార్టీలు ప్రకటించాయి. తర్వాత మళ్లీ ఉపసంహరించుకున్నాయి.
ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ఎప్పుడైతే ఘటన జరిగిందో.. వెంటనే ఏపీ ప్రభుత్వం స్పందించింది. అసలు ఈ ఘటనకు కారకులు ఎవరు.. అనే విషయంపై అన్వేషిస్తోంది. అయినప్పటికీ.. ప్రతిపక్షాలు గోల చేస్తుండటంతో సీఎం జగన్ వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించారు.
వెంటనే డీజీపీ గౌతమ్.. కేంద్రం హోంశాఖకు లేఖ రాశారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. అంటే.. ఇక్కడ బంతి వెళ్లి బీజేపీ చేతిలోనే పడింది. బీజేపీ అంటేనే హిందుత్వం. మరి.. హిందుత్వాన్ని కాపాడటానికి.. అసలు నిజం తెలుసుకోవడానికి.. బీజేపీ రంగంలోకి దిగుతుందా? హోంశాఖ మంత్రి అమిత్ షా దీనిపై ఎలా స్పందిస్తారు… అనేదే ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.
తమకు హిందుత్వంపై ఉన్న చిత్తశుద్ధిని బీజేపీ చూపించాలంటే.. ఖచ్చితంగా ఈ ఘటనపై సీబీఐ ఎంక్వయిరీ వేసి కేసును సీరియస్ గా దర్యాప్తు చేయాల్సిందే.. అని హిందుత్వ వాదులు కోరుతున్నారు. అలా అయితేనే అసలు నిజాలు బయటికి వస్తాయని.. హిందూ ద్రోహులు ఎవరో తెలుస్తుందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ ఈ ఘటనపై ఎంత త్వరగా ముందుకు వెళ్తే.. తమకు హిందుత్వంపై అంత చిత్తశుద్ధి ఉందని ప్రజలు నమ్ముతారని హిందుత్వ వాదులు ఆశిస్తున్నారు.
అంతర్వేది ఘటన తర్వాత బీజేపీ, జనసేన నేతలు దీక్షలు చేస్తూ ప్రభుత్వాన్ని నిందించడం కంటే.. పారదర్శకంగా ఈ కేసు పరిష్కరించడంలో సాయం చేస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఘటన జరగగానే రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేసి ప్రతిపక్షాలు.. ఇప్పుడు కేసు కేంద్రం చేతిలో ఉండటంతో.. కేంద్రంపై ఎంత మేర ఒత్తిడి తీసుకొస్తారో చూడాల్సిందే.