తిరుపతి బీజేపీ అభ్యర్థి, మాజీ ఐఏఎస్ అదికారిణి రత్నప్రభ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆమె దళితురాలు కాదంటూ కొన్ని ఆధారాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. రాజకీయ ప్రత్యర్థులు. ఆమె క్రిస్టియన్ అనీ, దాంతో దళిత క్రిస్టియన్.. బీసీ (సి) అవుతారనీ పేర్కొంటున్నారు కొందరు నెటిజన్లు. దళిత క్రిస్టియన్ల విషయమై దేశవ్యాప్తంగా ఎప్పటికప్పుడు రచ్చ జరుగుతూనే వుంది. మొన్నీమధ్యనే పార్లమెంటు సాక్షిగా దళిత క్రిస్టియన్ల విషయమై కేంద్రం స్పష్టతనిచ్చిన విషయం విదితమే. అయితే, క్రైస్తవ మతాన్నీ స్వీకరించినా, మత మార్పిడి జరగలేదన్న కారణంగానో, మరో కారణంగానో.. దళిత క్రిస్టియన్లయిన నేతలు కొందరు బీసీ (సి) కాకుండా, దళితులుగానే రాజకీయాల్లో కొనసాగుతున్నారు. గతంలో టీడీపీకి చెందిన నేతలు, ప్రస్తుతం వైసీపీకి చెందిన కొందరు నేతలు కూడా ఇలాగే ఆయా రిజర్వేషన్లకు అనుగుణంగా అక్రమంగా కీలక పదవుల్లో వున్నారన్న విమర్శల్ని ఎదుర్కొంటున్న సంగతి తెల్సిందే.
తిరుపతి రిజర్వుడు సీటు కావడంతో, ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి ‘కులం’ చర్చనీయాంశమవుతోంది. ఓ వ్యక్తి తన మీద గతంలో రత్నప్రభ పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చెల్లదంటూ కోర్టును ఆశ్రయించడమే కాదు, అందుకు తగిన ఆధారాల్నీ సేకరించారు. ఆ వ్యవహారాలన్నీ ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. అసలు రత్నప్రభ ఎలాంటి వ్యక్తి.? ఆమె గెలిస్తే ఏం చేస్తారు.? ఆమె వ్యక్తిత్వమేంటి.? ఆమెకున్న నాయకత్వ లక్షణాలేంటి.? అన్న చర్చ కాకుండా, కుల వివాదం తెరపైకి రావడమే శోచనీయం. ఏదిఏమైనా రాజకీయాలన్నాక అన్నీ భరించాల్సిందే. తనపై వస్తున్న ‘కులపరమైన’ విమర్శలకు రత్న ప్రభ వివరణ ఇచ్చుకోవాల్సి వుంది. లేదంటే, తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి ఇదో ఇబ్బందికరమైన పరిణామంగా మారొచ్చు.