కులాల, మతాల ప్రస్తావన లేకుండా భారతదేశ రాజకీయాల గురించి మాట్లాడటం సాధ్యం కాదు. సాధారణంగా రాజకీయ నాయకులు కులాలు, మతాల మధ్య ఘర్షణలు పెడుతూ వాళ్ళు మాత్రం పక్కన చోద్యం చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వైసీపీలో మాత్రం అధికరంలో ఉన్న నాయకుల మధ్యే కులాల ఘర్షణలు మొదలయ్యాయి. వైసీపీకి మొదట నుండి రెడ్డి కులస్థులకు అనుకూలమైనదనే వాదన ఉంది. అలాగే ఇప్పుడు వైసీపీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులకు, బీసీ నాయకులకు మధ్య గొడవలు మొదలయ్యాయి.
బీసీ నాయకులపై రెడ్డి నాయకుల పెత్తనం
వైసీపీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులపై విరుచుకుపడుతున్నారని బీసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ సాయి రెడ్డిలాంటి నాయకులు కూడా బీసీ నాయకులను కించపరుస్తున్నారని బీసీ నాయకులు చెప్తున్నారు. విశాఖలో డీఆర్సీ సమావేశంలో విజయసాయి రెడ్డి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్యాయాలకు పాల్పడుతున్నారనే విధంగా పరోక్షంగా ఆరోపించారు.అలాగే కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఎమ్మెల్యే వైకాపా సీనియర్ నాయకుడు పిల్లి సుభాష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇలా నిత్యం ఎదో రకంగా బీసీలకు వైసీపీలో అన్యాయం జరుగుతుందని బీసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జగన్ కు చెప్పినా ఫలితం లేదా!!
ఇలా తమపై జరుగుతున్న దాడులపై బీసీ నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే కరణం ధర్మశ్రీ విజయ్ సాయి రెడ్డిపై ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని సమాచారం. అలాగే రాష్ట్రంలో కూడా వైసీపీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు పెత్తనం చేలాయించడానికి ప్రయత్నిస్తూ ఇతర కులాలకు చెందిన నాయకులను తొక్కేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎంతో కష్టపడి అధికారం చేపట్టిన జగన్ ఇప్పుడు ఇలా పార్టీ నాయకులు చేస్తున్న తప్పులు ఇబ్బందులు తెచ్చుకునేలా ఉన్నాడని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.