IAF chopper crash: తమిళనాడులోని కూనూర్ సమీపంలో బుధవారం జరిగిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ రావత్, ఆయన భార్య మధులిక, 11 మంది సాయుధ బలగాలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ నిలకడగా ఉందని భారత వాయుసేన (ఐఏఎఫ్) అధికారులు శనివారం వెల్లడించారు.
వెల్లింగ్టన్ (తమిళనాడు)లోని సైనిక ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న గ్రూప్ కెప్టెన్‌ను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం లోక్‌సభకు తెలిపారు. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం శుక్రవారం ఆయనను బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం సింగ్ బెంగళూరులోని కమాండ్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
ఇక ఇదే హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన లాన్స్ నాయక్ ‘ సాయి తేజ’ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన సాయి తేజ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ వద్ద పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. సోషల్ మీడియా వేదికల్లో నెటిజన్లు సాయి తేజకు నివాళులు అర్పిస్తున్నారు.