కేంద్రానిది పాత ఆటే..

 

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాజధాని కాదని కేంద్రం తేల్చేసింది. ఇటీవల, కేంద్రం విశాఖను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తిస్తూ, పెట్రో ధరల విషయమై ఓ నివేదికలో పరోక్షంగా ఆ అంశాన్ని ప్రస్తావించింది. అది కూడా గత జులై నెలలో జరిగిన విషయం. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ విషయం పెద్దగా ఎక్కడా హైలైట్ కాలేదు. ఎప్పుడైతే, విశాఖను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కేంద్రం గుర్తించిందనే ప్రచారం షురూ అయ్యిందో, ఆ వెంటనే కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. విశాఖను రాజధానిగా పేర్కొనలేదనీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పెట్రో ధరల విషయమై రిఫరెన్స్ నగరంగా మాత్రమే విశాఖను పేర్కొన్నామనీ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరో రెండు రాష్ట్రాలకు చెందిన రాజధానుల వ్యవహారంపై ఇలాగే గందరగోళం నెలకొంది కేంద్రం పార్లమెంటులో విడుదల చేసిన లేఖ ద్వారా.

కేంద్రం తాజాగా ఈ అంశంపై ఇచ్చిన వివరణతో వైసీపీ శ్రేణులు షాక్‌కి గురయ్యాయి. ఎందుకంటే, కేంద్రం విశాఖను రాజధానిగా గుర్తించడం పట్ల సంబరాలు చేసేసుకున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. అంతే కాదు, విపక్షాలపై దుమ్మెత్తిపోశారు కూడా. బీభత్సమైన వెటకారాలు కూడా వైసీపీ నేతలు చేసెయ్యడం చూశాం. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కర్నూలుని న్యాయ రాజధానిగా పేర్కొంటోంది. ప్రస్తుత రాజధాని అమరావతిలో శాసన కార్యకలాపాలకు పరిమితం చేయనుంది జగన్ సర్కార్. అయితే, ఈ మూడు రాజధానుల అంశంపై హైకోర్టు ‘స్టేటస్ కో’ విధించడంతో, ప్రస్తుతానికి అమరావతి మాత్రమే రాష్ట్ర రాజధానిగా కొనసాగుతోంది. అయితే, కేంద్రం పలు అంశాలకు సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఓ సారి అమరావతి అనీ, ఇంకోసారి హైద్రాబాద్ అనీ.. ఆంధ్రప్రదేశ్ రాజధానిని పేర్కొంటుండడంతో రాజధాని విషయమై తీవ్ర గందరగోళం ఏర్పడుతున్న సంగతి తెలిసిందే.