ఇటీవల కాలంలో.. ముఖ్యంగా కరోనా తర్వాత రోజుల్లో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరికీ శ్రద్ధ పెరిగింది. ఇదే క్రమంలో సప్లిమెంట్లు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని చాలామంది నమ్ముతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్‌కి గుడ్ బై చెబుతాయంటూ విస్తారంగా కొన్ని సప్లిమెంట్లు మార్కెట్‌లో అందుబాటులో దొరుకుతున్నాయి. అయితే అవే ప్రమాదం కూడా పెంచగలవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
నిజానికి ఆహారం ద్వారా సరైన పోషకాలు పొందడం శ్రేయస్కరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. సప్లిమెంట్లు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కాకుండా హాని చేసే అవకాశం ఎక్కువ ఉందని అంటున్నారు. ఉదాహరణకు బీటా-కెరోటిన్ సప్లిమెంట్లు ధూమపానం చేసేవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పును 16% వరకు పెంచుతాయని అధ్యయనాలు గుర్తించాయి. అలాగే విటమిన్ సి సప్లిమెంట్లు ఎక్కువ తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లకు కారణం అవుతాయని చెబుతున్నారు.
సెలీనియం ఎక్కువగా తీసుకోవడం ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్‌ను పెంచే అవకాశం ఉంది. ఫోలిక్ యాసిడ్ కూడా మితిమీరినప్పుడు ప్రమాదమే. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్స పొందుతున్నవారు లేదా హార్మోన్ థెరపీ తీసుకుంటున్నవారు ఈ సప్లిమెంట్లను యథేచ్ఛగా వాడకూడదు. ఆహారం ద్వారా మాత్రమే పోషకాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సురక్షితంగా పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మొత్తానికి ఆరోగ్యం పేరుతో సప్లిమెంట్లకు అలవాటు పడకూడదు. రక్తపరీక్షలు, వైద్య సలహా తప్పనిసరిగా తీసుకుని మాత్రమే అవసరమైతే మాత్రమే సప్లిమెంట్లు తీసుకోవాలి. లేదంటే ఆరోగ్యం క్షీణించి ప్రమాదకరం కావచ్చని అంటున్నారు వైద్యులు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని మేము ధృవీకరించడం లేదు. ఫాలో అయ్యే ముందు వైద్యులను సంప్రదించండి.)