పవన్‌ని తిట్టిన పోసాని, కేసీఆర్‌ని కూడా తిడతారేమో.!

ఏపీ రాజకీయం తెలంగాణాలోనూ కాక రేపుతోంది. ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన సినీ సంబంధిత రాజకీయ ఆరోపణలు పెను దుమారం రేపాయి. దీనిపై పరిశ్రమ నుంచి స్పందన వచ్చింది. ఇంతలోనే మరో సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అనవసర రాద్ధాంతానికి తెర లేపారు. అక్కడితో వివాదం కొత్త మలుపు తిరిగింది.

తెలంగాణలో పలు చోట్ల పోసానిపై పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నేతలు ఫిర్యాదులు చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా తెలంగాణలోనూ జనసేనకు ఊపు తెచ్చింది. పోసానిని వెంటనే అరెస్టు చేయాలంటూ జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో అసలు జనసేన ఉందా.? అనే పరిస్థితి నుంచి జనసేన నేతలు ప్రెస్ మీట్లు పెట్టేదాకా వెళ్లింది పరిస్థితి. తాజాగా జనసేన నేతలు ప్రెస్ మీట్ పెట్టి పోసానిపై మండి పడ్డారు. ఆయన్ని అరెస్టు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అక్కడితో ఆగలేదు. ‘ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని తిట్టారు. ముందు ముందు కేసీఆర్‌ని కూడా తిడతారు.. పోసాని కృష్ణ మురళి నైజమే అంత. ఆయన విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరించొద్దు.. అంటూ తెలంగాణ ప్రభుత్వానికీ, తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీకి సూచించారు జనసేన నేతలు. ప్రస్తుతం తెలంగాణలో బీజీపీకి జనసేన మిత్ర పక్షంగా ఉంది. కానీ, టీఆర్ఎస్‌పై పెద్దగా రాజకీయ విమర్శలు చేయడం లేదు పవన్ పార్టీ నేతలు. భవిష్యత్తులో కూడా ఇదే వ్యూహాన్ని జనసేన కొనసాగించవచ్చు.

కాగా, షర్మిల రూపంలో టీఆర్‌ఎస్‌కి రాజకీయ ప్రమాదం అయితే పొంచి ఉంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరు. పోసానిని వెనకేసుకొస్తే, టీఆర్ఎస్‌కి లాభం ఉండదు. అదే, పోసాని విషయంలో జనసేనకు అనుకూలంగా ఉంటే, జనసేన నుంచి కొన్ని ఓట్లయినా గులాబీ పార్టీకి అదనంగా పడతాయి. బీజేపీ – జనసేన మధ్య పొత్తయితే ఉంది కానీ, రెండు పార్టీల మధ్యా సరైన అవగాహన లేదు. అది టీఆర్ఎస్‌కి లాభిస్త్తుంది.