హిందూపూర్ ఓటర్లకు గోరంట్ల మాధవ్ ‘ఒరిజినల్’ చూపించగలరా.?

తనను గెలిపించిన హిందూపూర్ ఓటర్లకు ఎంపీ గోరంట్ల మాధవ్ ‘ఒరిజినల్’ చూపించగలరా.? కేవలం, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడికీ, ఆయన కుమారుడు నారా లోకేష్‌కి మాత్రమే ‘ఒరిజినల్’ ఎందుకు చూపించాలి.? జన బాహుళ్యంలో జరుగుతున్న చర్చ ఇది.

గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో లీక్ వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీనే కుట్ర చేసి వుండొచ్చు. లేదా, ఆయన మీద హనీ ట్రాప్ అనేది జరిగి వుండొచ్చు. ఆయన తప్పు చేశారని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. కానీ, ఇది చిన్న విషయం కాదు. వచ్చిన ఆరోపణ అంత చిన్నది కాదు. అయితే, చాలా తేలిగ్గా చూస్తున్నారు అంతా ఈ విషయాన్ని.

తన మీద ఇంతటి దారుణమైన నిందల్ని విపక్షాలు మోపుతున్నప్పుడు, స్వచ్ఛందంగా ఆయన ముందుకొచ్చి, తన ఫోన్‌ని ఫోరెన్సిక్ విభాగానికి అప్పగించి వుండాలి. తానే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసి వుండాలి.. నిజాలు నిగ్గు తేల్చమని. కానీ, అలాంటిదేమీ జరగలేదు.

‘హండ్రెడ్ పర్సెంట్ ఫోరెన్సిక్..’ అని గతంలో హంగామా చేసిన గోరంట్ల మాధవ్, అసలు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సాక్షాత్తూ అనంతపురం ఎస్పీ ఫకీరప్ప వెల్లడించారు. గోరంట్ల మాధవ్ అభిమాని ఎవరో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారట. అంటే, రాజకీయ నాయకుల అభిమానులు చేసే ఫిర్యాదుల పట్ల ఏకంగా హోం మంత్రి, ఎస్పీ స్థాయి వ్యక్తులు స్పందించేసి, మీడియా ముందుకు వచ్చేస్తారా.?

వైఎస్ జగన్ ప్రభుత్వంలో అసలేం జరుగుతోంది.? అన్న చర్చ ఇప్పుడు వైసీపీ వర్గాల్లోనే జరిగేందుకు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఉదంతమే కారణమయ్యింది. తనను గెలిపించిన ఓటర్ల గౌరవ మర్యాదలు తగ్గించేలా, గోరంట్ల మాధవ్ జుగుప్సాకరమైన భాష ప్రయోగిస్తున్నారు. ‘ఇంటికెళ్ళి ఒరిజినల్’ చూపించడమేంటి.?