ఓట్లు, కరెన్సీ నోట్లు.. ఇది చాలా హాట్ గురూ.!

తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం కరెన్సీ నోట్లు ఓ ప్రవాహంలా ఓటర్ల వద్దకు చేరిపోతున్నాయ్. చాలా రోజులుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో కరెన్సీ సందడి కనిపిస్తోంది. అదిప్పుడు మరింత ముదిరి పాకాన పడింది. ఒక్కో ఓటుకీ 6 వేల నుంచి 16 వేల దాకా రాజకీయ పార్టీలు ఖర్చు చేయడానికి వెనుకాడ్డంలేదట.

సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న ఓ వీడియోలో ఓ వృద్ధుడు, తనకు ఓ రాజకీయ పార్టీ ఇచ్చిన కవర్ తెరిచి చూస్తే, అందులో 12 కరెన్సీ నోట్లు కనిపించాయి. అవన్నీ 500 రూపాయల నోట్లే. అంటే, మొత్తంగా ఆరు వేల రూపాయలన్నమాట.

ఇంకో చోట ఓ వృద్ధురాలికి 10 వేల రూపాయలు ఓ రాజకీయ పార్టీ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. 16 వేలు, ఆ పైన.. ఇరవై వేల రూపాయలదాకా ఒక్కో ఓటు కోసం రాజకీయ పార్టీలు ఖర్చు చేస్తున్నాయన్న ప్రచారం షురూ అయ్యేసరికి, రాజకీయ పార్టీల మీద కొందరు ఓటర్లు ఆ మొత్తం తమకూ ఇవ్వాలని ఒత్తిడి తెస్తుండడం గమనార్హం.

గతంలో ఓట్ల కోసం 2 వేల నుంచి ఐదారు వేల రూపాయలదాకా రాజకీయ పార్టీలు అనధికారికంగా ఖర్చు చేయడం చూశాం. కానీ, ఇప్పుడు ఆ మొత్తం పది వేలు దాటేసిందంటే, కాస్త కంగారు పడాల్సిన విషయమే. ఏం చేస్తే ఒక్క రోజులో.. కాదు కాదు, ఒక్క క్షణంలో పది వేలు, ఆ పైన సంపాదించొచ్చు.?

ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికలో కరెన్సీ నోట్ల సందడి కాస్త తక్కువగానే వుంది. అలాగని, అక్కడ అసలు కరెన్సీ సందడి లేదంటే అది హాస్యాస్పదమవుతోంది. అక్కడా ఓటు కోసం 2 వేల నుంచి ఐదు వేలదాకా రేటు పలుకుతోందట.