బటన్ నొక్కితే సరిపోతుందా జగన్ సారూ.?

సంక్షేమ పథకాలు అవసరమే.! రాష్ట్రంలో 87 శాతం ఇళ్ళకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ది కలుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారంటే, అసలు రాష్ట్ర ఆర్థిక ప్రగతి ఏంటి.? రాష్ట్రంలో ప్రజల ఆదాయ వ్యయాల మాటేమిటి.?

కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది. సంక్షేమ పథకాలంటే పేదరికాన్ని రూపుమాపడం కోసం.! మెజార్టీ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడమంటే అది ఓటు బ్యాంకు రాజకీయమవుతుంది తప్ప, అభివృద్ధి ఎలా అవుతుందనేది ఆర్థిక నిపుణులు సంధించే ప్రశ్న. ఎవరి గోల ఎలా వున్నా, సంక్షేమం చుట్టూనే రాజకీయం నడుస్తోందన్నది నిర్వివాదాంశం.

.’నేను బటన్ నొక్కడం మాత్రమే చేయగలుగుతాను. మీరు కూడా కష్టపడితేనే.. ఫలితం అనుకున్నట్లు వస్తుంది.. నేను బటన్ నొక్కకపోతే మీరు చేయగలిగిందేమీ వుండదు. నా పని నేను చేస్తున్నాను. మీ పని మీరు చెయ్యండి..’ అంటూ ఎమ్మెల్యలను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

బటన్ నొక్కి నిధులు విడుదల చేయడం అనేది కేవలం సంక్షేమ పథకాలకు మాత్రమే పరిమితమవుతోంది. అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల లేమి స్పష్టంగా కనిపిస్తున్న దరిమిలా, వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఏమని చెప్పి ఓట్లు అడగగలుగుతారు వైసీపీ నేతలు.. మరీ ముఖ్యంగా ప్రజా ప్రతినిథులు.?

పాదయాత్ర పేరుతో జనంలోకి వెళ్ళిన వైఎస్ జగన్, ముఖ్యమంత్రి హోదాలో జనం వద్దకు మునుపటిలా వెళ్ళేందుకు కొన్ని ఇబ్బందులు వుండొచ్చుగాక. కానీ, ‘కింది స్థాయిలో అన్నీ మీరే చూసుకోవాలి..’ అని ఎమ్మెల్యేల మీదా, ఇతర ప్రజా ప్రతినిథుల మీదా బాధ్యత పెట్టేస్తే, అది పార్టీకీ, ప్రభుత్వానికీ.. రెండిటికీ మంచిది కాదు.!