అప్పులు చేయడాన్ని ఏ రాష్ట్రమూ సమర్థించుకోకూడదు. కానీ, దేశంలో పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. అప్పు చేయడం ఓ ఫ్యాషన్ అయిపోయిందనే విమర్శలున్నాయి. ‘మాది ధనిక రాష్ట్రం. అప్పులు చేస్తాం.. అభివృద్ధి కోసం ఖర్చు చేస్తాం..’ అని కొన్నాళ్ళ క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పుకొచ్చారు. ధనిక రాష్ట్రం ఎందుకు అప్పలు చేయాల్సి వచ్చింది.? అంటే, దానికి అట్నుంచి సరైన సమాధానం వుండదు.
తెలంగాణ సంగతి ఇలా వుంటే, ఆంధ్రపదేశ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో వుంది.. అది విభజన కారణంగా వచ్చిన కష్టం. దాన్నుంచి గట్టెక్కడం రాష్ట్రానికి అంత తేలిక కాదు. కేంద్రం సహకరించడంలేదు.. రాష్ట్రంలో అభివృద్ధి జరగడంలేదు. కానీ, అప్పుల్లో మాత్రం గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. ఇది అనూహ్యమైన, అవాంఛనీయమైన వృద్ధి. సగటున ప్రతి ఒక్కరి మీద అప్పు భారం ఒకింత ఆందోళనకరమైన రీతిలో పెరిగిపోతున్న వైనం రాష్ట్ర ప్రజల్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. అయితే, తాము అప్పులు చేస్తున్నది సంక్షేమం కోసమేనని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పుకొచ్చారు. రాష్ట్రం చేసిన, చేస్తున్న అప్పుల గురించి ‘కాగ్’ కడిగి పారేయడంతో, బుగ్గన వివరణ ఇచ్చుకోక తప్పలేదు. ఏ రాష్ట్రమైనా.. దేశమైనా.. అభివృద్ధి ద్వారా సంపాదన పెంచుకోవాలి. అంతే తప్ప, సంక్షేమం పేరు చెప్పి అప్పులు చేస్తే, అది ప్రజలకు మేలు చేయదు. సంక్షేమం అనేది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఆ సంక్షేమం రాష్ట్రాన్నయినా, దేశాన్నయినా.. ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందన్నది నిర్వివాదాంశం. ప్రస్తుతానికి ‘కరోనా’ ఓ బూచి మాత్రమే. కరోనా కొట్టిన దెబ్బ చిన్నదేమీ కాకపోయినా, అప్పులనేవి అంతకు ముందు నుంచీ జరుగుతున్న వ్యవహారాలే.