ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనపై బుధవారం కూడా రాజ్యసభలో గందరగోళం నెలకొంది. ఉదయం సభ ప్రారంభం కాగానే చట్టాలపై, రైతలు ఆందోళననపై చర్చ నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కొత్త సాగు చట్టాలు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు.
ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించిన ప్రతిపక్ష సభ్యులు వినకపోవడంతో రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ముగ్గురు ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) ఎంపీలను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు.
రైతుల ఆందోళనపై చర్చలకు సమయం కేటాయించామని.. అయినప్పటికీ నిరసన తెలపడం సరికాదని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నా సహనాన్ని పరీక్షిస్తే మిమ్మల్ని రోజంతా సస్పెండ్ చేయాల్సి ఉంటుందంటూ.. రూల్ 255 ప్రకారం ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్ సహా మరో ఇద్దరిని సస్పెండ్ చేశారు. అనంతరం ఆప్ ఎంపీలను సభ నుంచి బయటకు పంపించారు. దీంతో సభను కొంతసేపు వాయిదా వేశారు.
దేశ రాజధాని సరిహద్దుల్లో గత రెండు నెలలుగా కొనసాగుతున్న రైతుల ఆందోళన అంశంపై పార్లమెంట్‌లో సుదీర్ఘ చర్చ జరగనుంది. దీనిపై రాజ్యసభలో దాదాపు 15 గంటల పాటు చర్చించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. బుధవారం ఉదయం ఎగువసభ ప్రారంభం కాగానే రైతుల ఆందోళనపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ అంశంపై కనీసం 5 గంటల పాటు సభలో ఏకధాటిగా చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ.. ప్రతిపక్షాల డిమాండ్‌ను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. దీనిపై 15 గంటల పాటు చర్చిద్దామని ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్ పక్షనేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం ఈ సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది