రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ వీడ్కోలు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావోద్వేగానికి గురయ్యాడు. మంళవారం నాడు రాజ్యసభ నుండి కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో రిటైర్ కానున్నారు. దీంతో ఆయన సేవలను పలువురు ప్రశంసించారు. గులామ్ నబీ సేవలను కొనియాడిన ఆయన, భావితరాలకు ఆయన స్ఫూర్తిమంతుడని అన్నారు. ఓ ఎంపీగా, ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా ఆయన ఇతర ఎంపీలకు, రాబోయే రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తారనడంలో సందేహం లేదని అన్నారు.
ముఖ్యంగా కశ్మీర్ లో ఓసారి ఉగ్రదాడి జరిగిన వేళ, గుజరాత్ వాసులు అక్కడ చిక్కుకుని పోయారని గుర్తు చేసుకున్న మోదీ, ఆ సమయంలో ఆజాద్ తో పాటు ప్రణబ్ ముఖర్జీ గుజరాతీలను కాపాడేందుకు ఎంత శ్రమించారో తనకు తెలుసునని ఉద్వేగంగా మాట్లాడారు. తన సొంత కుటుంబ సభ్యులు చిక్కుకుంటే ఎంత శ్రమిస్తారో, ఆజాద్ అంత శ్రమించారని అన్నారు. ఆయన స్థానంలో ఎవరో ఒకరు వస్తారన్న సంగతి తనకు తెలుసునని, కానీ ఆ వచ్చే వ్యక్తి ఆజాద్ ను మరిపించాలంటే చాలా కష్టమని అన్నారు.
నాకు గులామ్ నబీ ఆజాద్ ఎన్నో ఏళ్లుగా తెలుసు. మేమిద్దరం ఒకే సమయంలో ముఖ్యమంత్రులుగా ఉన్నాం. అంతకుముందే ఎన్నో సార్లు కలసుకున్నాం. ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఎంతో ముందుంటారు. ప్రకృతితో మమేకం అవుతుంటారు. ఉద్యానవనాల విషయంలో ఆయనకు చాలా తెలుసు. పదవులు వస్తుంటాయి. అధికారం దక్కుతుంది. కానీ వాటిని ఎలా నిర్వహించాలన్న విషయాన్ని ఎవరైనా ఆజాద్ ను చూసి తెలుసుకోవచ్చు” అని మోదీ వ్యాఖ్యానించారు.