సోనియా గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో… కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ అధ్యక్ష పదవిపై చర్చ జరిగింది. అయితే ఈ సమావేశం కాస్త వాడీవేడీగానే జరిగిందని చెప్పుకోవాలి.
ఓవైపు తాను తాత్కాలికంగా కూడా అధ్యక్ష పదవికి ఉండలేనని సోనియా తేల్చి చెప్పారు. మరోవైపు ఎవరు పార్టీ పగ్గాలను తీసుకుంటారు.. అన్న దానిపై సీనియర్ నాయకులంతా మేధోమథనం చేస్తున్నారు.
ఈనేపథ్యంలో సీడబ్ల్యూసీ మీటింగ్ లో ఓ లేఖపై చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని.. ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం కష్టమంటూ 23 మంది సీనియర్ నాయకులు సోనియా గాంధీకి లేఖ రాశారు.
ఆ లేఖపై చర్చ జరుగుతుండగా.. రాహుల్ గాంధీ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. సీనియర్ నాయకులపై రాహుల్ ఫైర్ అయ్యారు.
బీజేపీతో కుమ్మక్కయి సోనియా గాంధీకి లేఖ రాశారా? అంటూ రాహుల్ సీనియర్ నాయకులను నిలదీసేసరికి.. అంతా షాక్ అయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు కొందరు నాయకులు తీవ్రంగా నొచ్చుకోగా… వెంటనే కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్పందిస్తూ… బీజేపీతో జత కలిసి సోనియా గాంధీకి లేఖ రాశామని నిరూపిస్తే.. తాను వెంటనే పార్టీకి రాజీనామా చేస్తానని ఆజాద్ ప్రకటించారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారమే లేపాయి. వెంటనే కాంగ్రెస్ మరో సీనియర్ నేత కపిల్ సిబాల్ ట్విట్టర్ లో స్పందిస్తూ… నా రాజకీయ జీవితంలో గత 30 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఏనాడూ బీజేపీ అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. అంటూ స్పష్టం చేశారు.
రాజస్థాన్ లో ప్రభుత్వం కూలకుండా ఉండటం కోసం.. ప్రభుత్వాన్ని నిలబెట్టడం కోసం కాంగ్రెస్ కు అండగా ఉన్నాం. మణిపూర్ లో బీజేపీని గద్దె దించడానికి పార్టీ తరుపున పోరాడాం.. అంటూ సిబాల్ ట్వీట్ చేశారు.
పార్టీ కోసం ఇంత చేసినప్పటికీ.. మేము బీజేపీతో కుమ్మక్కయ్యామంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం.. అంటూ కపిల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
అయితే… కపిల్ ట్వీట్ పై స్పందించిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా.. రాహుల్ గాంధీ అటువంటి వ్యాఖ్యలు చేయలేదని… ఇదంతా మీడియాకు వచ్చిన తప్పుడు సమాచారం అని ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ అలాంటి వ్యాఖ్యలను ఎన్నటికీ సహించరంటూ ట్వీట్ చేశారు.