అమెరికాని వెనిజులా ఎదురుకోగలదా.. యుద్ధం వస్తే జరిగేది ఇదే..!

వెనిజులాపై అమెరికా చేపట్టిన ఆకస్మిక చర్యలు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను అమెరికా అదుపులోకి తీసుకుందన్న వార్తలు వెలుగులోకి రావడంతో గ్లోబల్ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. ఈ ఆపరేషన్‌ను అమెరికా ప్రత్యేక దళం డెల్టా ఫోర్స్ నిర్వహించిందన్న సమాచారం పరిస్థితిని మరింత తీవ్రమయ్యేలా చేసింది.

ఇదే సమయంలో వెనిజులా రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతకు మరింత ఆజ్యం పోశాయి. లొంగిపోను.. చివరి శ్వాస వరకు పోరాడతా అన్న ఆయన ప్రకటన రెండు దేశాల మధ్య సైనిక సంఘర్షణ తప్పదన్న సంకేతాలను ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఒక ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది.. నిజంగా యుద్ధం మొదలైతే వెనిజులా అమెరికా వంటి అగ్రశక్తిని ఎదుర్కోగలదా..?

వెనిజులా సైన్యాన్ని అధికారికంగా నేషనల్ బొలివేరియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌గా పిలుస్తారు. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటమే ప్రధాన లక్ష్యంగా ఈ దళాలు పనిచేస్తాయి. ప్రస్తుతం వెనిజులాకు సుమారు రెండు లక్షల మంది క్రియాశీల సైనికులు ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. రిజర్వ్ దళాలు, మిలీషియా బలగాలను కలుపుకుంటే ఈ సంఖ్య కొంత పెరిగినా, మొత్తం సైనిక సామర్థ్యం పరిమితంగానే కనిపిస్తుంది.

వైమానిక దళాల విషయంలో వెనిజులా వద్ద ఉన్న యుద్ధ విమానాలు ఎక్కువగా పాత తరం వాటే. రష్యా తయారీ Su-30MK2 విమానాలు ఉన్నప్పటికీ, అవి అమెరికా వద్ద ఉన్న స్టెల్త్ టెక్నాలజీ ఫైటర్లను ఎదుర్కొనే స్థాయిలో లేవన్నది నిపుణుల అంచనా. భూ బలగాల్లో వేల సంఖ్యలో సాయుధ వాహనాలు ఉన్నప్పటికీ, ఆధునిక ట్యాంకులు మాత్రం చాలా తక్కువ. నావికా బలగాలు కూడా ప్రధానంగా తీరప్రాంత రక్షణకే పరిమితమై ఉన్నాయి.

ఇంకా కీలకమైన అంశం రక్షణ బడ్జెట్. వెనిజులా ఏడాదికి కేటాయించే రక్షణ వ్యయం కేవలం కొన్ని బిలియన్ల డాలర్లకే పరిమితం. ఇది ఆధునిక ఆయుధాలు, శిక్షణ, సాంకేతిక అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారుతోంది. అందువల్ల వెనిజులా సైన్యం ప్రాంతీయ రక్షణకు సరిపోతుందేమోగానీ, ప్రపంచ అగ్రశక్తితో నేరుగా తలపడే స్థాయిలో లేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

ఇదే సమయంలో అమెరికా సైన్యం గురించి మాట్లాడితే పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంగా గుర్తింపు పొందిన యునైటెడ్ స్టేట్స్ వద్ద లక్షలాది మంది శిక్షణ పొందిన సైనికులు, వేల సంఖ్యలో ఆధునిక యుద్ధ విమానాలు, అణు శక్తితో నడిచే విమాన వాహక నౌకలు, సబ్‌మేరీన్లు ఉన్నాయి. అంతేకాదు, సైబర్ యుద్ధం, అంతరిక్ష దళం, అత్యాధునిక క్షిపణి వ్యవస్థలతో కూడిన సమగ్ర సైనిక నిర్మాణం అమెరికాను అజేయ శక్తిగా నిలబెడుతోంది.

ఈ రెండు దేశాల బలాబలాలను పోల్చిచూస్తే, ప్రత్యక్ష యుద్ధంలో వెనిజులాకు అవకాశాలు చాలా స్వల్పంగా కనిపిస్తున్నాయి. అందుకే వెనిజులా గెరిల్లా తరహా వ్యూహాలు, అంతర్గత మిలీషియా దళాలపై ఆధారపడే ప్రయత్నం చేయవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇవి కొంతకాలం ప్రతిఘటన చూపినా, దీర్ఘకాలంలో అత్యాధునిక ఆయుధాలు, సాంకేతికత కలిగిన అమెరికా సైన్యాన్ని ఎదుర్కోవడం వెనిజులాకు అత్యంత కఠినమైన సవాలుగానే మారనుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.