టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని నిన్న ఆయనపై కేసు నమోదైంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కొల్లు రవీంద్ర ఇంట దగ్గర ఈ ఉదయం నుంచి హై టెన్షన్ నెలకొంది. ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న టీడీపీ శ్రేణులు..భారీగా తరలివచ్చాయి. పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది.
కొల్లు రవీంద్ర అరెస్టుతో మచిలీపట్నంలో ఉద్రిక్తత ఏర్పడింది. వైద్య పరీక్షల కోసం కొల్లు రవీంద్రను ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ పరిశీలించేందుకు వెళ్తున్న కొల్లు రవీంద్రను నిన్న 25వ నంబరు పోలింగ్ బూత్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, కొల్లు రవీంద్రకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ కొల్లు రవీంద్ర నేల మీద కూర్చుని నిరసన తెలిపారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు, ఎంపీ కేశినేని నాని ఖండించారు. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రవీంద్ర అరెస్ట్‌ను టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను లక్ష్యంగా చేసుకుందని, పండుగ రోజు కూడా వారిని సంతోషంగా ఉండనివ్వడం లేదని మండిపడ్డారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గూండాయిజాన్ని ఎదిరించినందుకే బీసీలపై కక్షకట్టారా, అని ప్రశ్నించారు. రవీంద్ర చేసిన నేరమేంటని నిలదీశారు. పండగ పూట కూడా బీసీలను సంతోషంగా ఉండనీయడం లేదని మండిపడ్డారు.