సినిమాల షూటింగ్స్ ఆగిపోవడం, పూర్తైన చిత్రాలు విడుదల కాకపోవడంతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోట్ల రూపాయలు ఫైనాన్స్ తెచ్చి సినిమాల మీద పెట్టి లక్షల్లో వడ్డీలు కడుతున్నారు. ఈ వడ్డీల బెడద తప్పాలి అంటే సినిమాలు రిలీజవ్వాలి. అందుకే అందరూ థియేటర్లు తెరుచుకునే సమయానికి సినిమాలను రెడీ చేసుకునే పనిలో పడిపోయారు.
రిలీజ్ చేయాలనుకోవడం వరకు బాగానే ఉంది కానీ ముందు ఎవరు వెనుక ఎవరు అనేదే పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఆగష్టు నెలలోనే మూడు నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, బాలకృష్ణ ‘అఖండ’, రవితేజ ‘క్రాక్’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’, వెంకటేష్ ‘నారప్ప’ చిత్రాలను రిలీజ్ చేయాలని ఆయా చిత్రాల నిర్మాతలు అనుకుంటున్నారు. ఇవే కాదు నాగచైతన్య ‘లవ్ స్టోరీ’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ కూడ ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా చిన్న సినిమాలు నాలుగైదు వరకు ఉన్నాయి.
ఈ సినిమాలన్నీ ఒకే నెలలో విడుదల అవ్వాలి అంటే కుదరని పని. థియేటర్ల సంఖ్య సరిపోదు. పైగా ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే అంటున్నారు. దీనికితోడు తగ్గిన టికెట్ ధరలు. ఈ సమస్యలన్నింటి నడుమ ఒకేసారి అన్ని సినిమాలు రావడం మంచి పరిణామం కాదు.
కాబట్టి ఎవరో ఒకరు వెనక్కు తగ్గక తప్పదు. ఎవరికి వారు ముందుగా సినిమాను రిలీజ్ చేసి ఆర్థిక సమస్యల నుండి బయటపడదాం అనుకునేవారే. మరి వీరందరిలో ఎవరు త్యాగం చేసి వెనక్కు తగ్గుతారో చూడాలి.