నిధుల కోసమే జగన్ ఢిల్లీ టూర్: స్పష్టం చేసిన మంత్రి బొత్స

Botsa Slams TDP Regarding Jagan's Delhi Tour

Botsa Slams TDP Regarding Jagan's Delhi Tourప్రతి విషయాన్నీ రాజకీయం చేయడం విపక్షాలకు తగదంటూ మంత్రి బొత్స సత్యానారాయణ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళింది రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసమేనని బొత్స చెప్పుకొచ్చారు.కేసుల మాఫీ కోసం ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళారంటూ టీడీపీ బాధ్యతారాహిత్యంతో కూడిన వ్యాఖ్యలు చేస్తోందని మంత్రి మండిపడ్డారు. ‘ముఖ్యమంత్రిగా వున్నప్పుడు చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్ళారు.. అప్పుడు ఆయన రాష్ట్రం కోసం కాకుండా దేనికోసం వెళ్ళారు.?’ అని ప్రశ్నించిన బొత్స, ప్రతిపక్షం రాష్ట్ర ప్రభుత్వానికి మెరుగైన సూచనలు ఆయా అంశాల్లో ఇచ్చి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సుద్దులు చెప్పారు.

నిజానికి, చంద్రబాబు హయాంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాగే ఢిల్లీ టూర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వెళ్ళారంటూ అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సహా పలువురు వైసీపీ ముఖ్య నేతలు విమర్శించేవారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. అయితే, దేశం ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో, రాష్ట్రం ఇప్పుడు ఎదుర్కొంటోన్న సంక్షోభం నేపథ్యంలో, సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న టీడీపీ అధినేత చంద్రబాబు, రాజకీయ విమర్శల్ని కొద్ది రోజులపాటు పక్కన పెడితే, ఆయనకే అది హుందాతనం.

అయినా, కేసుల మాఫీ కోసం ఢిల్లీకే వెళ్ళాలా.? వ్యాక్సిన్ సహా అనేక విషయాల్లో కేంద్రాన్ని వైఎస్ జగన్ నిలదీస్తున్నారంటేనే.. ఆయన ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గే వ్యక్తి కాదని తేలిపోతోంది. అయినాగానీ, ఎక్కడో బీజేపీ – వైసీపీ మధ్య స్నేహం మాత్రం అలాగే కనిపిస్తూ వుండడం విపక్షాలకు బాగా కలిసొస్తోంది.. రాజకీయ విమర్శలు చేయడం కోసం. ఏపీ బీజేపీ, వైసీపీ మీద నాటకీయ పద్ధతుల్లో విమర్శలు చేయకపోతే, ఆ అనుమానాలకీ ఆస్కారం వుండి వుండేది కాదేమో.