వచ్చే జనవరి లో రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హాజరుకానున్నారని సమాచారం. నవంబర్ 27న జాన్సన్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరిపిన ఫోన్ సంభాషణల్లో ఆయన ను వచ్చే ఏడాది రిపబ్లిక్ డే ముఖ్య అతిధిగా హాజరుకావాలని కోరారు.
దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని సమాచారం. అదే సమయంలో బ్రిటన్‌లో జరిగే జీ7 సదస్సుకు హాజరుకావాలని జాన్సన్ ప్రధాని మోదీని కోరారు.
రాబోయే పదేళ్లలో రెండు దేశాలూ అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఇద్దరు ప్రధానులు చర్చించారని సమాచారం. బ్రెగ్జిట్ అనంతర పరిణామాల్లో బ్రిటన్‌కు భారత్‌తో పాటు ప్రపంచ దేశాల సహకారం ఎంతో అవసరం. ఈ తరుణంలో భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొల్పాలని బ్రిటన్ ప్రధాని బలంగా కోరుకుంటున్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌కు చివరిసారి 1993లో అప్పటి బ్రిటన్ ప్రధాని జాన్ మేజర్ ముఖ్య అతిథిగా వచ్చారు. జాన్సన్‌తో ఫోన్ సంభాషణ తర్వాత మోదీ ట్వీట్ చేశారు.
వచ్చే దశాబ్దంలో ఇండియా, యూకే సంబంధాల కోసం రోడ్ మ్యాప్‌పై చర్చించిట్లు ఆ ట్వీట్‌లో మోదీ వెల్లడించారు.వాస్తవానికి 2021 రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా అమెరికా కొత్త అధ్యక్షుడు బైడెన్ ను ఆహ్వానించాలని అనుకున్నా కూడా ఆయన పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టేందుకు మరింత సమయం పట్టనుండటంతో జాన్సన్ ను ఆహ్వానించినట్లు సమాచారం.