కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తగ్గుముఖం.. భయపెడ్తున్న బ్లాక్ ఫంగస్

Black Fungus, The New Worry For India

Black Fungus, The New Worry For India

దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మెజార్టీ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా తగ్గాయి. ఓ వారం క్రితం వరకూ పాజిటివిటీ రేటు ప్రమాదకరంగా వున్న రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి.. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం పడుతుండడం ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రపదేశ్, కేరళ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో మాత్రం కరోనా కేసులు ఎక్కువగానే నమోదువుతున్నాయి.. ఈ రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు కూడా ఎక్కువగానే వుంటోంది. ఇదిలా వుంటే, దేశంలో కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టిందని కేంద్రం ప్రకటించేసింది. మరోపక్క, బ్లాక్ ఫంగస్ కేసులు మాత్రం అనూహ్యంగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారిలోనే ఈ బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్న సంగతి తెల్సిందే. బ్లాక్ ఫంగస్ బాధితులకు వైద్య చికిత్స ఖరీదైన వ్యవహారంగా మారిపోతోంది. చికిత్సలో భాగంగా వినియోగించే మందులు అతి ఖరీదైనవి కావడమే అందుక్కారణం.

కేంద్రం, ఆయా రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులకు అనుగుణంగా అవసరమైన మందుల్ని సరఫరా చేస్తున్నా, అవి సరిపోవడంలేదు. నల్ల బజారులో ఆయా మందుల రేట్లు ఆకాశాన్నంటేస్తున్నాయి. కరోనా వైరస్ బారిన పడి, ఆక్సిజన్ సాయంతో కోలుకున్నవారు, స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడినవారు.. మాస్కుని ఎక్కువ సమయం పెట్టకుని వున్నవారు.. బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అధికారికంగా వెలుగు చూస్తున్న బ్లాక్ ఫంగస్ కేసుల కంటే, కింది స్థాయిలో వెలుగు చూస్తోన్న అనధికారిక కేసుల సంఖ్య చాలా ఎక్కువగా వుందన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. బ్లాక్ ఫంగస్ సాధారణంగా వాతావరణంలో వుండే ఫంగస్ మాత్రమేననీ, ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గుతుందో వారిని ఈ ఫంగస్ ఇబ్బంది పెడుతుందనీ, ఒక్కోసారి ప్రాణాంతకం కూడా అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.