ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో భారతీయ జనతా పార్టీ సరికొత్త ఆలోచనలు చేస్తోందట. అమరావతి పరిరక్షణ సమితి చేపడుతున్న యాత్రకు జనాదరణ పెరుగుతున్న దరిమిలా, ఏకైక రాజధాని అమరావతి అనే నినాదాన్ని బీజేపీ తన భుజానికెత్తుకోబోతున్నట్లే కనిపిస్తోంది.
మరి, రాయలసీమ అభివృద్ధి.. కర్నూలులో హైకోర్టు.. అంటూ గతంలో నినదించిన బీజేపీ, తన వాయిస్ మార్చుకుంటోందని అనుకోవచ్చరా.? రాజకీయాల్లో మార్పులు సహజం. పార్టీలు తమ సిద్ధాంతలకు విరుద్ధంగా వ్యవహరించడమూ మామూలే.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, అమరావతి ఎజెండాగా ప్రజల ముందుకు వెళుతుందనే సంకేతాలు వెల్లడవుతున్నాయి. అమరావతి ఉద్యమానికి పూర్తి మద్దతివ్వాలనీ, గతంలో రాజధాని అమరావతికి ఆమోదం తెలిపిన ప్రభుత్వంలో భాగమై వున్నామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్టీ ముఖ్య నేతలకు స్పష్టం చేశారంటూ మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు.
ఒక్కరోజులో అమరావతి విషయమై ఏపీ బీజేపీ నేతల స్వరం మారిపోయింది. అమిత్ షా ఆంధ్రప్రదేశ్ టూర్‌లో అతి పెద్ద విశేషమిదే. చిత్రమేంటంటే, టీడీపీ అధినేత చంద్రబాబుని రాజకీయ శతృవుగా చూడటం.. అనే భావన నుంచి కూడా కాస్త వెనక్కి తగ్గుతున్నారు ఏపీ బీజేపీ నేతలు.
2024 ఎన్నికల్లో టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జనసేన.. అనే కూటమి ఖచ్చితంగా వుంటుందనే ఊహాగానాలకు రాష్ట్రంలో తాజా పరిణామాలు ఊతమిస్తున్నాయి. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. అయితే, అమరావతి విషయంలో వైసీపీ సర్కారు, బీజేపీ నుంచి తలనొప్పిని ఎదుర్కొని ఎలా నిలబడుతుంది.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.