హైద్రాబాద్‌లోని పాత బస్తీలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై సర్జికల్ స్ర్టైక్స్ చేస్తామంటూ గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల సమయంలో బీజేపీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. జీహెచ్ఎంసీ మేయర్ పీటం బీజేపీ దక్కించుకోలేకపోయినా చెప్పుకోదగ్గ సంఖ్యలో డివిజన్లను గెలుచుకుంది. కానీ, బీజేపీ చేస్తామన్న సర్జికల్ స్ర్టైక్స్ చేయలేదు. ఏ సందర్భానికి అవసరమైన అంశాన్ని ఆ సందర్భానికి అనుగుణంగా పట్టుకుని వేలాడడం తప్ప, బీజేపీ నుండి చిత్తశుద్ధి రాజకీయాల్ని ఆశించలేం. హుజురాబాద్ ఉప ఎన్నిక వేడి రాజుకుంది. మళ్లీ బీజేపీ హుషారు ఎక్కువైంది. తెలంగాణా భవన్ స్థలాన్ని పేదలకు పంచిస్తామంటోంది బీజేపీ.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గోల్కొండ కోటపై బీజేపీ జెండా అన్నారు. ఇప్పుడేమో, తెలంగాణా భవన్ స్వాధీనం చేసుకుంటామంటున్నారు. అంతే తప్ప, కేంద్రంలో అధికారంలో ఉన్న తాము రాష్ర్టానికి ఏం చేస్తామన్నది మాత్రం చెప్పడం లేదు. ఏపీ, తెలంగాణాల్లో బీజేపీ నేతలు జస్ట్ పేపర్ టైగర్స్. వీళ్ల తాటాకు చప్పుళ్లకి ప్రజలే లైట్ తీసుకుంటున్నారు. ఇక, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకుంటారా.? ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో కొన్ని వైఫల్యాలున్నాయి. వాటిని ఎండగట్టలేని అసమర్ధత బీజేపీది. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్రం తీసుకుంది. కానీ, రాష్ర్టాల్లో అవసరమైన మేర వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచడంలో కేంద్రం విఫలమవుతోంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించాల్సిన కేంద్రం, రాష్ర్టాల నెత్తిన ఆ బాధ్యత పడేసింది. ఇవన్నీ హుజురాబాద్ ఉప ఎన్నికలోనే కాదు, సాధారణంగా కూడా ప్రజల్లో చర్చకు వస్తాయి.