ఓడిపోయాం.. కానీ, బలపడ్డాం: బీజేపీ వింత వాదన.!

బీజేపీ అద్భుతాలేమీ చేయలేకపోయింది. బద్వేలు ఉప ఎన్నిక బరిలోకి అత్యుత్సాహంగా దిగి చేతులు కాల్చుకుంది. నానా రకాల ఆరోపణలు చేసి, నానా విధాలుగా హంగామా చేసి.. తుస్సుమనిపించేసింది. ఓటర్లకు అన్నీ తెలుసు. పెరుగుతున్న పెట్రో ధరల నుంచి, రాష్ట్రంపై బీజేపీ నిర్లక్ష్యం వరకు.. అన్నిటినీ ఓటర్లు గుర్తుపెట్టుకున్నారు.

అయినా, సిట్టింగ్ ఎమ్మెల్యే అకాల మరణంతో తలెత్తిన ఉప ఎన్నికలో సదరు ఎమ్మెల్యే సతీమణి పోటీ చేస్తున్నప్పుడు, బరిలోకి తమ అభ్యర్థిని బీజేపీ దింపడం ఎంతవరకు నైతికత.? ఈ కోణంలో బీజేపీ ఆలోచించలేకపోయింది. రెండు, రెండున్నరేళ్ళ పదవీ కాలం కోసం.. ఇంతలా బీజేపీ దిగజారాలా.? అన్న చర్చ జరిగింది.

సరే, బీజేపీకి కింది స్థాయిలో జనసేన, టీడీపీ సహకరించాయన్న ఆరోపణల్ని పక్కన పెడితే, మరీ దారుణ ఓటమి అయితే కాదు బీజేపీది. మూడు పార్టీలూ కలిసి సాధించిన ఓట్లుగా బీజేపీకి వచ్చిన ఓట్లను రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

అయితే, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం, ‘ఇది మాకు వచ్చిన ఓట్ల వ్యవహారం.. మేం బలం పుంజుకున్నాం.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటుతాం.. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందనడానికి ఇదే నిదర్శనం..’ అంటున్నారు.

వాపుని చూసి బలుపు.. అనుకుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? మిత్రపక్షం బీజేపీని సరిగ్గా కలుపుకుపోయి వుంటే, బీజేపీకి కాస్త మెరుగైన రీతిలో ఓట్లు పడేవి. చివరి క్షణంలో టీడీపీ, తమ ఏజెంట్లను బీజేపీకి అప్పగించడం వల్ల బీజేపీ గౌరవప్రదమైన ఓట్లు తెచ్చుకుందేమోగానీ.. అదీ లేకుండా, కాంగ్రెస్ కంటే దారుణమైన పరిస్థితి వుండేదేమోనన్న వాదనలూ లేకపోలేదు.