BJP’s Cunter Attack : తెలంగాణ రాష్ట్ర సమితిని టచ్ చేయాలని చూస్తే ఏమవుతుందో గులాబీ పార్టీ, భారతీయ జనతా పార్టీకి రుచి చూపించింది. బీజేపీ కీలక నేతలపైన ఏకంగా హత్యాయత్నం నేరాన్ని మోపుతోంది తెలంగాణ రాష్ట్ర సమితి. దాంతో, తెలంగాణ కమలదళం డిఫెన్స్‌లో పడిపోయింది.
‘కేసీయార్‌ని జైలుకు పంపుతాం..’ అంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేసిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, మొన్నామధ్యన ఓ కేసులో జైలుకెళితే, బీజేపీ అధినాయకత్వం తరఫున ప్రతినిథులు దిగి రావాల్సి వచ్చింది.
ప్రతిసారీ గులాబీ పార్టీదే పైచేయి అవుతుండడం పట్ల తెలంగాణ బీజేపీ నేతల్లో అసహనం పెరిగిపోతోంది. ‘కేసీయార్‌ని జైలుకు పంపి తీరతాం..’ అని పదే పదే చెబుతున్నామనీ, అయినా ఆ విషయంలో అధినాయకత్వం సహకరించడంలేదనీ తెలంగాణ కమలనాథులు ఆఫ్ ది రికార్డుగా గుస్సా అవుతున్నారట.
ఈ నేపథ్యంలో, ఢిల్లీ స్థాయిలో చర్చోపచర్చలు జరుగుతున్నాయట కమలం పార్టీలో. రైట్ టైమ్ చూసి, కేసీయార్‌ని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు అధిష్టానం వ్యూహరచన చేస్తోందంటూ తెలంగాణ కమలనాథులు కొందరు తమ సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారట.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద హత్యాయత్నానికి బీజేపీ వ్యూహరచన చేసిందనేది గులాబీ పార్టీ అభియోగం. కేసులు నమోదయ్యాయి, అరెస్టులూ జరిగాయి.. కమలం గగ్గోలు కూడా చూస్తున్నాం. ఆ శ్రీనివాస్ గౌడ్ సన్నిహితులే, ఆయన్ని హతమార్చేందుకు ప్లాన్స్ వేసిన దరిమిలా.. ఆ మంత్రి శ్రినివాస్ గౌడ్ అవినీతి బాగోతాన్ని బయటకు తీసేందుకు ప్రస్తుతం సమాలోచనలు చేస్తోందట కమలదళం. తద్వారా గులాబీ పార్టీకి చెక్ పెట్టాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.