ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ మీద రాజకీయ పార్టీలు చేస్తున్న స్వార్థ రాజకీయాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరికివారు లబ్ది పొందాలని చూసేవారు కానీ ఒక్కరు కూడ చిత్తశుద్ధితో పోలవరం కోసం పోరాటం చేద్దామనే ఆలోచనలో లేరు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారును ఎదిరించాలంటే అందరికీ భయమే. ఈ రాజకీయ క్రీడలో ప్రధాన పాత్రధారిగా ఉన్నది కూడ భారతీయ జనతా పార్టీనే. జరుగుతున్న పరిణామాలను చూస్తే ప్రాజెక్ట్ మీద ఉక్కు పాదం మోపి ఎన్నికల ప్రయోజనాలు పొందాలనేది బీజేపీ ఉద్దేశ్యంలా కనిపిస్తోంది.
గత ప్రభుత్వం టీడీపీ కేంద్రాన్ని కిందికి దించకుండా సొంత నిధులు ఖర్చుచేసి ప్రాజెక్ట్ పనులు చేపట్టింది. వాటిలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఆ ఆరోపణలకు అడ్డంపెట్టుకుని కేంద్రం నిధుల రీఎంబర్సిమెంట్ నిలిపివేసింది. ఇప్పుడేమో కొత్తగా అంచనా వ్యయాన్ని 47 వేల కోట్ల నుండి 21 వేల కోట్లకు కుదించి అదే అసలు అంచనా, దాని ప్రకారమే ప్రాజెక్ట్ కట్టుకోండి అంటూ మెలికపెడుతోంది. ఇక్కడ అధికార పక్షం వైసీపీ ఏమో లోకల్ మీడియా ముందు ఆ లెక్కలు ఈ లెక్కలు చెప్పి చంద్రబాబును బూచిగా చూపిస్తున్నదే తప్ప బీజేపీ మీద ఒత్తిడి పెంచట్లేదు.
రాజకీయ విశ్లేషకులు అయితే పోలవరాన్ని అడ్డంపెట్టుకుని రాబోయే ఎన్నికలను శాసించాలనేది బీజేపీ ప్రధాన లక్ష్యమని అంటున్నారు. 2024 ఎన్నికలకు బీజేపీ సిద్ధం చేసుకునే మేనిఫెస్టోలో పోలవరం ప్రధాన ఎజెండాగా పెట్టుకుని, తమని గెలిపిస్తే ప్రాజెక్ట్ కడతాయని బీజేపీ జనం ముందుకు వెళుతుందని చెబుతున్నారు. ఒకవేళ ఇదే గనుక జరిగితే జనం బీజేపీని చావుదెబ్బ కొడతారు. ప్రజలు ఒకప్పటిలా లేరు. తమ అవసరాలను ఆసరాగా తీసుకుని ఆడుకుంటే అస్సలు ఊరుకోరు. తమ ఆశలతో, ఆశయాలతో, బ్రతుకులతో ఓటు బ్యాంకు రాజకీయం చేయాలనుకుంటే మాత్రం కమల దళాన్ని రాష్ట్రంలో నామరూపాయాల్లేకుండా చేస్తారు.