హైదరాబాద్ పాత బస్తీ అంటే ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం, ఇక్కడ మజ్లీస్ పార్టీ హవా ఎక్కువగా కనిపిస్తుంది. ఎలాంటి ఎన్నికలు జరిగిన కానీ మజ్లీస్ పార్టీకు తిరుగులేదు. 2016 లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 50 స్థానాలు కలిగిన పాతబస్తీలో 44 సీట్లు కైవసం చేసుకొని పాతబస్తీ తమకు కంచుకోట అంటూ మరోసారి నిరూపించింది మజ్లీస్ పార్టీ.
అయితే ఈ సారి కంచుకోటాను బద్దలు కొట్టటానికి బీజేపీ సిద్ధమయినట్లు తెలుస్తుంది. దుబ్బాకలో విజయం సాధించటంతో సరికొత్త ఉత్సహంతో రంకెలేస్తున్న బీజేపీ గ్రేటర్ లో కూడా అదే సత్తాను కనబరచాలని చూస్తుంది. ఈ సారి ఓల్డ్ సిటీలోని 50 వార్డుల్లోనూ అభ్యర్థులను బరిలో దింపుతోంది. ఓవైసీ నాయకత్వంలోని ఏఐఎంఐఎంతో పోటీకి సై అంటోంది. మజ్లిస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందని… ఇటీవలి వర్షాల కారణంగా భారీగా వరద నీరు ఇళ్లలోకి ముంచెత్తినప్పటికీ.. వేలాది కుటుంబాలకు ఆ పార్టీ ఏం చేయలేకపోయిందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి క్రిష్ణ సాగర్ రావు ఆరోపించారు.
సుపరిపాలన, సమ్మిళిత అభివృద్ధి నినాదంతో తాము ముందుకెళ్తామన్నారు. ఇదే సమయంలో గ్రేటర్ లో కూడా బీజేపీ లోకి చేరికలు జరుగుతున్నాయి.కాంగ్రెస్ నేత, మాజీ మేయర్ బండ కార్తీకా రెడ్డి బీజేపీలో చేరారు. తాను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కుమారుడు రవి కుమార్ యాదవ్ సైతం బీజేపీలో చేరారు. దీనితో బీజేపీ బలం పెరిగినట్లైంది.
మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా మజ్లీస్ పార్టీని టార్గెట్ చేస్తూ పాతబస్తీలో తమ సత్తాను చాటాలని చూస్తుంది .లక్షలాది మందికి డబుల్ బెడ్రూం ఇళ్ల దరఖాస్తులు ఇచ్చి 2016 ఎన్నికల్లో మజ్లిస్-టీఆర్ఎస్ మోసం చేశాయని కాంగ్రెస్ మాజీ మంత్రి మహ్మద్ అలీ ఆరోపించారు. బిహార్, మహారాష్ట్ర ఎన్నికల్లో తమ పార్టీ ఓటు బ్యాంక్‌కు మజ్లిస్ గండి కొట్టిందని ఆయన ఆరోపించారు. దానికి ప్రతీకారం తీర్చుకుంటామని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. ఇక ఎప్పటిలాగే తెరాస పార్టీ మజ్లీస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని ఆ పార్టీ బలంగా ఉన్న పాంత్రాల్లో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టబోతుంది. మరి బీజేపీ మరియు కాంగ్రెస్ లు ఈ సారి ఒవైసీ కంచుకోటాను బద్దలు కొడుతాయో లేదో చూడాలి.