ఆంధ్రప్రదేశ్ పై పగబట్టిన బీజేపీ

bjp-taking-revenge-on-andhrapradesh

bjp-taking-revenge-on-andhrapradesh

కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అన్ని రాష్ట్రాల మీద, అన్ని ప్రాంతాల పట్ల సమదృష్టిని కలిగి ఉండాలి. రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలి. కేందం అనేది మిధ్య అన్నారు స్వర్గీయ ఎన్టీఆర్. కేంద్రానికి నిధులు సమకూర్చేది రాష్ట్రాలే. రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వసూలు చేసి కేంద్రానికి సమర్పించుకుంటే వాటిలో భాగాన్ని ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఇస్తుంది. అంతే తప్ప కేంద్రం ఏమీ దయతలచి ఇవ్వదు. అదే ప్రజాస్వామ్యం అంటే.

గత ఏడేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పరమ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రులను నిలువునా ముంచింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హోదా వద్దు..పాకేజీ ముద్దు అన్నారు. అందుకు కేంద్రం ఎందుకు అంగీకరించింది? హోదా ఇవ్వడానికి తగిన అర్హతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేవని కేంద్రం ప్రకటించింది. ఆ విషయం హామీ ఇచ్చే సమయంలో తెలియదా? మోడీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు రాజకీయాల్లో అనేకపదవులను నిర్వహించిన అనుభవజ్ఞులే కదా? దీన్నిబట్టి అర్ధం అయ్యేది ఏమిటి? కావాలనే బీజేపీ ఆంధ్రులను మోసం చేసింది అనే కదా? పోనీ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇస్తామంటే ఎవరైనా అభ్యంతరం తెలిపారా? పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం కూడా అభ్యంతరం తెలపలేదు. ఆంధ్రాకు హోదా ఇస్తే మాకు అభ్యంతరం లేదని నిన్నగాక మొన్న లోక్ సభలో టీఆరెస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా ప్రకటించారు. నీతి ఆయోగ్ మీద, ఆర్థికసంఘం మీద నెపం వేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ తీరని ద్రోహం చేసింది.

ఇక అయిదు కోట్ల ఆంధ్రులు ప్రాణాలకు తెగించి పోరాడి సాధించుకున్న ఒకేఒక పెద్ద కర్మాగారం విశాఖ స్టీల్ ప్లాంట్. పాతికవేలమందికి ఉపాధిని కల్పించడమే కాక రాష్ట్రానికే తలమానికం అనదగిన స్టీల్ ఫాక్టరీని తెగనమ్మడానికి నిర్ణయించింది. అధికార వైసిపి ఎంతగా ప్రతిఘటిస్తున్నప్పటికీ, పార్లమెంట్ సాక్షిగా వైసిపి ఎంపీలు విజయసాయిరెడ్డి నాయకత్వంలో వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్రం తన మొండి వైఖరిని వీడటం లేదు. మా ఆస్తి మా ఇష్టం అని బరితెగించి మాట్లాడుతున్నారు. ప్రజల భావోద్వేగాలను ఏమాత్రం లెక్క చెయ్యడం లేదు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి రెండు సార్లు లేఖలు వ్రాశారు. స్టీల్ ఫ్యాక్టరీకి సొంత గనులను కేటాయిస్తే లాభాలలోకి వెళ్తుందని జగన్మోహన్ రెడ్డి సూచించారు. స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమం చేస్తే తాము కూడా అండగా నిలబడతామని తెలంగాణ మునిసిపల్ మంత్రి కేటీఆర్ బాహాటంగా ప్రకటించారు. కేటీఆర్ ప్రకటించడం అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లే. ఇంతమంది కోరుతున్నప్పటికీ కేంద్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని వ్యవహరించడం దారుణం.

పోలవరం విషయంలోనూ కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా వెళ్తున్నది. జాతీయప్రాజెక్టుగా ప్రకటించినప్పుడు నిర్మాణ బాధ్యత తామే తీసుకుని పూర్తి చేయాలి. కానీ చంద్రబాబుతో ఉన్న మైత్రి కారణంగా రాష్ట్రానికే నిర్మాణ బాధ్యతను అప్పగించింది. 2015 లో సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్ట్ అంచనా యాభై అయిదువేల కోట్ల రూపాయలకు చేరింది. దానికి నిధులను మంజూరు చెయ్యలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మరీ దుర్మార్గంగా వ్యవహరించడం మొదలు పెట్టింది కేంద్రం. ఎప్పుడో ఏడేళ్ల క్రితం ఆమోదించిన ఇరవై వేలకోట్ల రూపాయలు మాత్రమే ఇస్తామని మడతపేచీ పెట్టింది. ఒకసారి సవరించిన అంచనాలను ఆమోదించమంటారు. మరొకసారి పాత అంచనా ప్రకారమే ఇస్తామంటారు. జగన్ ప్రభుత్వం కేంద్రానికి ఎంత సహకారం అందిస్తున్నప్పటికీ కూడా కేంద్రం నుంచి సహకార వైఖరే కనిపించడం లేదు.

ఇక తాజాగా తిరుమల ప్రసాదం మీద, కాటేజీల మీద, ఇతర వస్తువుల మీద కూడా జీఎస్టీ విధించి భక్తులను దోపిడీ చేస్తున్నది కేంద్రం. తమది హిందూ ఉద్ధారక ప్రభుత్వం అని డప్పు కొట్టుకుంటూ దేశంలోనే అతి పెద్దదైన పుణ్యక్షేత్రం తిరుమల ప్రసాదాల మీద కూడా పన్నులు వేస్తున్న దుర్మార్గాన్ని చూసి భక్తులు నిర్ఘాంతపోయారు. గత ఏడాది కాలంలో సుమారు నూట ఇరవై కోట్ల రూపాయలను జిఎస్ టి రూపంలో కేంద్రం వసూలు చేసిందంటే అంతకన్నా ఘోరం మరొకటి ఉందా? తిరుమల విషయంలో జీఎస్టీ మినహాయించామని వైసిపి లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఎంత ఆందోళన చేసినప్పటికీ ఏమాత్రం కనికరం లేకుండా తిరుమలకు మినహాయింపులు ఇవ్వలేము అని కేంద్రం తెగేసి చెప్పడం చూస్తుంటే బీజేపీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ మీద ఎంత కక్ష ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.

ఈరకంగా బీజేపీ మొండిగా వెళ్తే ఆంధ్రులు అందుకు తగినరీతిలో బుద్ధి చెబుతారు. మరో రెండు మూడేళ్ళలో రాష్ట్రంలో బీజేపీ భూస్థాపితం అయిపోవడం ఖాయం.

 

ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు