తల కనిపించట్లేదు కానీ అదిగో తోక అన్నట్టుంది ఏపీ బీజేపీ వైఖరి. సోము వీర్రాజు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి భారతీయ జనతా పార్టీ చెబుతున్న ఒకే ఒక మాట 2024 ఎన్నికల్లో అధికారం మాదే అని. ఏ పార్టీకైనా అధికారంలోకి వస్తామని ధీమా ఉండటం మంచిదే కానీ ఆ ధీమా వెనకాల కారణాలు, అనుగుణమైన పరిస్థితులు కూడ ఉండాలి. అప్పుడే వినే జనం కాస్తో కూస్తో నమ్ముతారు. కానీ బీజేపీ మాత్రం అధికారం మాదే అంటుంది కానీ అందుకు దారితీసే పరిణామాలేమిటో మాత్రం చెప్పట్లేదు.
గతంతో పోలిస్తే ఈమధ్య ఆంధ్రా రాజకీయాల్లో కషాయ దళం గొంతుక బలంగా వినిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బలహీనంగా ఉండటం, జనసేనతో పొత్తు ఈ డెవలప్మెంట్ కు కారణాలు. తాజాగా దేవాలయాల మీద దాడులు, తిరుమల డిక్లరేషన్ రగడ వంటి వివాదాలను పెద్దవి చేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు సైతం జనం ఆ పార్టీ గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి. అయితే ఈ కారణాలకే అధికార పీఠం వారి ఒళ్ళో వాలిపోతుందా అంటే ముమ్మాటికీ అసాధ్యమనే అనాలి. అసలు వారితో పొత్తులో పవన్ కళ్యాణ్ కూడా అధికారం తమ కూటమిదేనని మాటవరసకు కూడా ఒక మాట అనలేదు.
అసలు బీజేపీకి జనంలో ఆదరణ పెరగడం సంగతి అటుంచితే 151 సీట్లతో మేరు పర్వతంలా నిలబడి ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలుతుందని బీజేపీ అనడంలో ఏమన్నా అర్థముందా. వీళ్ళు చేసే మత రాజకీయాలు, హిందూ మత రక్షణ ఉద్యమాలు ఏదో కొద్దిలో కొద్దిపాటి తేడాను తీసుకురావొచ్ఛేమో అమాంతం జగన్ సర్కారును కూల్చడం జరగని పని. తాజాగా కూడ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సైతం వచ్చే ఎన్నికలో వైసీపీకి అధికారం దూరమవుతుందని, అధికార పీఠం తమదేనని మాట్లాడారు. భవిష్యత్తు ఏమిటో కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతున్నా బీజేపీ నేతలు మాత్రం సర్కార్ కూలుతుంది ఎలా అనేది మాత్రం సీక్రెట్ అన్నట్టు మాట్లాడటం మేకపోతు గాంభీర్యమే తప్ప మరొకటి కాదు.