తెలంగాణ రాజకీయ రసవత్తరంగా సాగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఎవరి వ్యూహాలతో వారు ముందుకు కదులుతున్నారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు తమ ప్రధాన ప్రత్యర్థిగా టిఆర్ఎస్ పార్టీను చూస్తుండగా వాటిలో బీజేపీ కాంగ్రెస్ పార్టీని సైతం తెరాసతో సమానంగా తమ ప్రత్యర్థి కింద లెక్కగట్టింది. అంటే బీజేపీకి ఇద్దరు అపొనెంట్స్ అన్నమాట. ఒకరి మీద యుద్దమైతై పర్వాలేదు కానీ ఇద్దరి మీద కావడంతో బీజేపీ రెట్టింపు శ్రమ చేస్తోంది. జాతీయ నాయకత్వం కూడ రానున్న వరుస ఎన్నికల్లో పైచేయి సాధించడానికి రాష్ట్ర శాఖకు కావలసినంత సహకారం అందిస్తోంది.
ఇప్పటికే పార్టీలో ఉత్సాహం నింపడానికి కార్యవర్గంలో తెలంగాణ నుండి ఇద్దరికి ప్రధాన పదవులను కట్టబెట్టింది. మాజీ మంత్రి డి.కె. అరుణకు కీలకమైన జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి కట్టబెట్టి తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌కు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష పదవిని ఇచ్చింది. దీనర్థం మున్సిపల్, ఎమ్మెల్సీ, దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టాలని గట్టిగా చెప్పడమే. అందుకే పదవులు అందుకున్న నేతలు పని మొదలుపెట్టారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే ఫార్ములాను వాడుతున్నారు డి.కె.అరుణ. ఆ రెండు పిట్టలే తెరాస, కాంగ్రెస్ పార్టీలు.
ఆ రెండు పార్టీలను ఒకే గాటికి కట్టేసి అవి రెండూ కుమ్మక్కయ్యాయని ప్రచారం చేస్తే సరిపోతుందనేది బీజేపీ ప్లాన్. అందుకుగాను రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెరాసలు కలిసి పనిచేయనున్నాయనే ప్రచారం స్టార్ట్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఫేస్ అంటే అనుమానం లేకుండా రేవంత్ రెడ్డే. కాబట్టి ఆయన్ను దెబ్బకొట్టగలిగితే కాంగ్రెస్ సగం నిర్వీర్యం అయినట్టేనని అనుకుంటున్నారు. ఆయన ప్రభుత్వం మీద చేసే విమర్శలు, ఆరోపణలు, పోరాటాలు ఒట్టి బూటకమని, కావాలంటే ఆయన లెవనెత్తిన ఏ అంశంలో అయినా ప్రభుత్వానిది తప్పు ఉందని నిరూపించారా, అధికారం అయితే టిఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీల చేతుల్లోనే ఉండాలని ఇలా చేస్తున్నారని అంటున్నారు.