వినాయక చవితి పేరుతో బీజేపీ ‘మత’ రాజకీయాలు చేస్తోందా.?

గణపతి బప్పా మోరియా.. అంటూ వీధులు మార్మోగిపోయేవి.. గ్రామాల్లో, టౌన్లలో, నగరాల్లో, పట్టణాల్లో వినాయక చవితి వేడుకలంటే ఆ కిక్కే వేరప్పా. పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో.. వేల సంఖ్యలో గణేష్ మండపాలు గ్రామాల నుంచి పట్టణాల దాకా ఏర్పాటవుతుంటాయి. దాదాపు 10 రోజుల పాటు ఈ సెలబ్రేషన్స్ కనిపిస్తుంటాయి. కానీ, గత ఏడాది కోవిడ్ 19 పాండమిక్ నేపథ్యంలో గణేష్ ఉత్సవాలు సరిగ్గా జరగలేదు. ఈ ఏడాది కోవిడ్ నుంచి కాస్త ఉపశమనం లభించింది. దాంతో, పలు రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాలకు చిన్నపాటి నిబంధనలతో అనుమతులు ఇచ్చేశారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, కోవిడ్ 19 పాండమిక్‌ని సాకుగా చూపిస్తూ, బహిరంగ ఉత్సవాలను నిషేధించింది. మండపాల ఏర్పాటుకు ససేమిరా అనేసింది. ఇళ్ళల్లోనే ఉత్సవాలు చేసుకోవాలని సూచించింది. ‘ఇళ్ళల్లోనే చేసుకోవాలి..’ అని ప్రభుత్వం చెప్పడం అస్సలేమాత్రం సమర్థనీయంగా లేదన్నది మెజార్టీ అభిప్రాయం.

నిజానికి, ప్రభుత్వం చెప్పినా.. చెప్పకున్నా వినాయక చవితి వేడుకల్ని ఇంట్లో నిర్వహించుకుంటారు హిందువులు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. వీధుల్లో మండపాల్ని ఏర్పాటు చేసేది.. పబ్లిసిటీ కోసం కాదు. అందరూ కలిసి సంబరాలు చేసుకోవడం కోసం. రాజకీయ పార్టీలు తమ రాజకీయం కోసం బహిరంగ సభలు, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ప్రభుత్వ పెద్దలు, జనాల్లోకి వెళ్ళిపోయి.. జన సమీకరణ చేపట్టొచ్చు. కానీ, వినాయక చవితి వేడుకలకు ఆటంకాలు సృష్టిస్తారా.? అన్న ప్రశ్న బీజేపీ నుంచి ఉత్పన్నమవుతోంది. జగన్ సర్కార్ హిందువులపై ఉక్కుపాదం మోపుతోందని బీజేపీ విమర్శిస్తోంది. బీజేపీ నుంచే కాదు.. ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి విమర్శలే చేస్తుంది. మండపాల నిర్వహణ, నిమజ్జనం వంటి అంశాలపై ఖచ్చితమైన నిబంధనల్ని రూపొందించి చవితి ఉత్సవాలకు ప్రభుత్వం అనుమతిచ్చి వుంటే ఈ సమస్య వచ్చి వుండేది కాదు.