తెలంగాణ పీసీసీ అద్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డి ఎంపిక విషయమై తెలుగుదేశం పార్టీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. కారణం, ఆయన ఒకప్పుడు టీడీపీలో కీలక నేత కావడమే. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు రేవంత్ రెడ్డి. అంతే కాదు, చంద్రబాబు కోసమే ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయారాయన.
రేవంత్ రెడ్డి అప్రూవర్ అయితే చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోతుందనీ, చంద్రబాబు జైలుకి వెళ్ళడం ఖాయమనీ రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. సరే, రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలేననుకోండి.. అది వేరే సంగతి. 2019 ఎన్నికల్లో దారుణంగా దెబ్బ తిన్న టీడీపీ, 2024 ఎన్నికల్లో ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలనే కసితో వున్నారు చంద్రబాబు.
ఈ క్రమంలో ఆయన బీజేపీనో, కాంగ్రెస్ పార్టీనో తన మిత్రుడిగా ఎంచుకోక తప్పదు. చంద్రబాబు అత్యంత వ్యూహాత్మకంగా ఇరు పార్టీలతోనూ సన్నిహిత సంబంధాలు నడిపేస్తున్నారంటూ ఓ వాదన తెరపైకొస్తోంది. బీజేపీలో తన వర్గం నేతల ద్వారా బీజేపీ అధిష్టానాన్ని టీడీపీతో పొత్తు విషయమై ఒప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారట.
మరోపక్క, కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబుకి తెరవెనుకాల ఒప్పందాలు కుదరడం వల్లే రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడయ్యాడంటున్నారు. వీటిల్లో ఏది నిజం.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో చంద్రబాబుకి ‘మిత్రుడు’ కావాలి.
ఆ మిత్రుడు, రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి మేలు చేయాలి. బీజేపీతో పోల్చితే కాంగ్రెస్ పార్టీనే చంద్రబాబుకి కాస్తో కూస్తో బెటర్ అనుకోగలమా.? ఏమో, చంద్రబాబు ఆలోచనలు ఎలా వున్నాయో.. ఆయనకి మాత్రమే తెలుసు ఆ తదుపరి బకరా ఎవరన్నది.