వైసీపీ నుంచి మద్దతుని బీజేపీ అస్సలు ఆశించలేదా.?

రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బీజేపీ కీలక నేత సత్యకుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మద్దతిస్తోన్న అభ్యర్థి ద్రౌపది ముర్ముకి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కావాలని వైసీపీని తాము అడగలేదంటున్నారాయన.

రాష్ట్రపతి ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరగాలి గనుక, గిరిజన వర్గానికి చెందిన మహిళకు రాష్ట్రపతిగా అవకాశం దక్కనున్నందున, ద్రౌపది ముర్ముకి తాము మద్దతిచ్చామని వైసీపీ మొదటి నుంచీ చెబుతూ వస్తోంది. అయితే, ద్రౌపది ముర్ముని బీజేపీ ప్రతిపాదించింది. బీజేపీ అభ్యర్థికి వైసీపీ మద్దతివ్వాలంటే, ముందుగా బీజేపీ నుంచి వైసీపీతో మంతనాలు జరగాలి.

కానీ, బీజేపీ జాతీయ నాయకులెవరూ వైసీపీ అధినాయకత్వంతో ఈ విషయమై మాట్లాడిన దాఖలాల్లేవు. మరి, వైసీపీ ఎందుకు బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థికి అనుకూలంగా మాట్లాడుతోంది.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.

నిజానికి, ఈ రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో, రాష్ట్రానికి సంబంధించిన అంశాల్ని డిమాండ్ రూపంలో కేంద్రం ముందుంచి, బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థికి సానుకూలంగా ఓటేసే విషయమై వైసీపీ నిర్ణయం తీసుకోవాల్సి వుంది. అలా చేయడం ద్వారా రాష్ట్రానికి బీజేపీ ఏదో మేలు చేసేస్తుందని కాదు. కానీ, కనీసం ఏపీ ప్రజల దృష్టిలో అయినా, వైసీపీ ఇమేజ్ పెరిగేది.

ఏదిఏమైనా, వైసీపీ తీసుకుంటోన్న కొన్ని నిర్ణయాలు.. ప్రజల్లో వైసీపీని పలచన చేస్తున్నాయి. బీజేపీ – వైసీపీ మధ్య స్నేహాన్ని వైసీపీ ఎంపీ శ్రీధర్ ఇటీవల వెల్లడించారు కూడా.