ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. సాధారణంగా చలికాలంలో చలి పుట్టాలి కానీ.. ఈ సారి మాత్రం చలికాలంలో రాజకీయల వేడి పుడుతోంది. మామూలుగా కాదు.. మొన్ననే దుబ్బాక ఉపఎన్నిక పోరు ముగిసింది. అంతే.. మళ్లీ గ్రేటర్ పోరు ప్రారంభమైంది. దీంతో రాజధానిలో ఎక్కడ చూసినా.. ఎన్నికల హడావుడే.
ఇంకో వారంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు తమ ప్రచారాస్త్రాన్ని ఇతర పార్టీలపై సంధిస్తున్నాయి. ఇక్కడ పోటీ ముఖ్యంగా రెండే రెండు పార్టీల మధ్య. ఒకటి టీఆర్ఎస్ రెండోది బీజేపీ.
ఎలాగైనా గ్రేటర్ ఎన్నికల్లో గెలవాలన్న కసితో టీఆర్ఎస్ పార్టీ ఉంది. సీఎం కేసీఆర్ కూడా దూకుడు మీదున్నారు. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. హైదరాబాద్ ప్రజలకు వరాల జల్లు కురిపించారు.
మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించి.. హైదరాబాద్ లో పాగా వేయడానికి బీజేపీ కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. అందుకే.. గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి ఏకంగా బెంగళూరు నుంచి ఓ యువ ఎంపీని దించింది. ఆయనే తేజస్వి సూర్య. ఆయనతో గ్రేటర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది.
ఇక.. ఆ యువ ఎంపీ మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్ పై విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకొని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
తెలంగాణ వచ్చాక కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందంటూ ఆయన విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. కుటుంబ పాలనను తరిమికొట్టాలని… బీజేపీని గెలిపించి.. నగరాన్ని అభివృద్ధి చేసుకుందామంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ యువ ఎంపీ ప్రచారం వల్ల బీజేపీకి వచ్చే లాభం ఏంటో తెలియదు కానీ.. టీఆర్ఎస్ పార్టీకి మాత్రం తీవ్రంగా నష్టం కలిగిస్తుండటంతో వెంటనే టీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇంకాస్త ఘాటుగా ప్రచారం ప్రారంభించింది. ప్రజల్లోకి పూర్తిగా వెళ్తు.. ఈ ఆరేళ్ల కాలంలో టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ కు ఏం చేసిందో.. బీజేపీ పార్టీ ఏం చేయలేదో చెప్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది.