విలన్ ఫేస్‌తో ఉన్న ఏపీ బీజేపీ.. హీరో అవ్వడం ఎలా.. ఇదే వాళ్ల ప్రాజెక్ట్ 

Somu Veerraju
ఏపీ బీజేపీ వైఖరి ఇప్పుడిప్పుడే జనాలకు అర్థమవుతోంది.  మొదటి నుండి ద్వంద్వ వైఖరినే అవలంభిస్తూ వచ్చిన కమల దళం పైకి మాత్రం తమంతట మంచివారు లేరని బుకాయిస్తూ వచ్చింది.  ఒకసారి వైసీపీ వైపు మాట్లాడటం ఇంకోసారి టీడీపీ భావజాలాన్ని ప్రదర్శించడం చేస్తూ వచ్చింది.  కానీ అధ్యక్ష పదవిలోకి సోము వీర్రాజు రావడంతో వారి మనసులో ఏముందో బయటపడిపోయింది.  మొదటి నుండి బీజేపీకి తెలుగు ప్రజలు ఆఖరి స్థానమే ఇస్తూ వచ్చారు.  గత ఎన్నికల్లో కూడా అదే చేశారు.  పైగా ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వకుండా ఎగ్గొట్టారనే కోపం మనవాళ్లలో ఇప్పటికీ ఉంది.  మన లీడర్లు బీజేపీకి దాసోహమని జనం గొంతు నొక్కేశారు కానీ లేకపోతే హోదా విషయంలో బీజేపీని నిలదీసేవారు మన జనం.  
 
ప్రజెంట్ పోరాటం నడవకపోయినా లోపల మాత్రం మోదీ హోదా ఇవ్వకుండా మాట తప్పారనే కోపం అయితే ఉంది.  ఇక తాజాగా మూడు రాజధానుల బిల్లుకు బీజేపీ అడ్డు చెప్పలేదనే కోపం ఒక వర్గం జనంలో బలంగా ఉంది.  వెరసి ఏపీలో బీజేపీకి విలన్ ఫేస్ అనే ముద్రపడిపోయింది.  ఇప్పుడు ఆ ముద్రను చెరిపేసుకుని హీరోగా మారాలని అనుకుంటోంది కమల దళం.  కానీ అదంతా సులభమైన పని కాదు.  రెండు ప్రధాన విషయాల్లో ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన బీజేపీని జనం నమ్మాలంటే చాలా కష్టం.  అందుకే హైకామాండ్ ఒక పథకం రచించింది.  అదే టార్గెట్ టీడీపీ. 
 
టీడీపీ ఎలాగూ రాష్ట్రంలో బలహీనంగా ఉంది.  ఓటింగ్ శాతమైతే బాగానే ఉంది కానీ సీట్ల సంఖ్య మరీ తక్కువ కావడంతో టీడీపీ పనైపోయిందనే భావన మొదలైంది ప్రజల్లో.  ఇక ఆ గత పాలనలో బాబుగారు చేసిన తప్పులు కూడా గట్టిగానే ఉన్నాయి.  అందుకే తప్పుల్ని టీడీపీ మీదకి ఈజీగా నెట్టివేయవచ్చనేది బీజేపీ ప్లాన్ కావొచ్చు.  అన్ని నష్టాలకు మాజీ ముఖ్యమంత్రిగా బాబును ప్రొజెక్ట్ చేస్తే వచ్చే ఎన్నికల్లో అపోజిషన్ స్థానంలో స్థిరపడవచ్చని ఆశపడుతున్నారు కమలనాథులు.  మరి వారి ఆశలు ఏమేరకు నెరవేరుతాయో చూడాలి.