భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతోంది. బలపడటానికి కావలసిన అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో వారికి ఇరు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఉప ఎన్నికలు బాగా కలిసొస్తున్నాయి. ఇప్పటికే దుబ్బాక గెలుపుతో కొండెక్కి కూర్చున్న కమలదళం తిరుపతిలోనూ అదే సీన్ రిపీట్ చేయాలని తహతహలాడుతోంది. ఇంకా ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండగానే బీజేపీ పెద్దలు ఉప ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ఆంధ్రాలో విశాఖ తర్వాత బీజేపీకి అంతో ఇంతో పట్టున్నది తిరుపతిలోనే. ఒకప్పుడు ఇక్కడ బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపొంది ఉన్నారు. అందుకే కష్టపడితే ఈ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చనే ఆశతో ఉంది బీజేపీ.
ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి తిరుపతిలో పర్యటించి అక్కడి పరిస్థితుల మీద, గెలుపు అవకాశాల మీద ఒక తెచ్చుకున్నారు. ఇక చేయాల్సిందల్లా వ్యూహ రచన, ఆ తర్వాత కార్యాచరణ. ఎంతో కీలకమైన వ్యూహ రచనలో బీజేపీ ప్రధానంగా వైసీపీని టార్గెట్ చేసింది. అంటే నేరుగా జగన్ మీదకే యుద్దమన్నమాట. దేవుళ్లను, దేవాలయాలను, మతాలను వాడుకోవడంలో బీజేపీది అందెవేసిన చేయి. ఆ విషయాల్లో వారికి వారే సాటి. జగన్ పాలనలో టీటీడీలో జరిగిన వివాదాలను ఎన్నికల్లో వాడుకోవాలనే ఆలోచనలో ఉన్నారట కమలం నేతలు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక బాబాయి వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ ను చేశారు. ఇక సుబ్బారెడ్డి ఈమధ్య తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కొంచెం కాంట్రవర్సీ అవుతున్నాయి.
తిరుమల కొండ మీద అన్యమత ప్రచారం జరుగుతోందని, టీటీడీ భక్తి ఛానెల్ నందు అపచారాలు జరిగాయనే ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. ఇక అన్యాక్రాంతం అవుతున్నాయనే కారణంతో శ్రీవారి ఆస్తులను వేలం వేయాలని టీటీడీ బోర్డు భావించండం మీద పెద్ద రగడే జరిగింది. అలాగే శ్రీవారి పేరిట బ్యాంకుల్లో వేల కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లతో రాష్ట్ర ప్రభుత్వ బాండ్లను కొనాలనుకున్నారు పాలకమండలి వారు. అన్నిటికీ మించి సీఎం జగన్ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టకపోవడాన్ని భూతద్దంలో చూపించారు ప్రత్యర్థులు. ఇక దేవాలయాల మీద దాడుల వివాదాన్ని ఇప్పట్లో వదిలేలా లేదు బీజేపీ. వీటన్నింటినీ కట్టకట్టి ఒకేసారి ఎన్నికల్లో ప్రయోగిస్తే వైసీపీ దెబ్బైపోవడం ఖాయమనే భావనలో ఉందట బీజేపీ.