నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన భారతీయ జనతా పార్టీ(BJP) జాతీయ నాయకత్వం.. పలువురు కొత్త వారికి అందులో చోటు కల్పించింది. వివిధ విభాగాలకు సంబంధించి పలువురు నేతలకు ఎంపిక చేసిన బీజేపీ… తెలంగాణకు చెందిన డీకే అరుణ, ఏపీకి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరికి జాతీయ పార్టీ కార్యవర్గంలో కీలక పదవులు కట్టబెట్టింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఆశించిన డీకే అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కింది. ఇక ఏపీకి చెందిన బీజేపీ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరికి కూడా బీజేపీ జాతీయ నాయకత్వం కీలక పదవి అప్పగించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల జాబితాలో ఆమెకు చోటు కల్పించింది. ఇక ఏపీకి చెందిన సత్యకుమార్‌కు జాతీయ కార్యదర్శుల జాబితాలో చోటు దక్కగా… తెలంగాణకు చెందిన బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైన లక్ష్మణ్‌ను బీజేపీ ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుని గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు డీకే అరుణ. తనకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తే టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొంటానని ఆమె పార్టీ నాయకత్వానికి చెబుతూ వచ్చారు. అయితే పార్టీ అధ్యక్ష పదవిని మొదటి నుంచి పార్టీలో ఉంటూ వస్తున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు కట్టబెట్టింది బీజేపీ జాతీయ నాయకత్వం. దీంతో డీకే అరుణకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయిందనే వార్తలు వినిపించాయి.
అయితే ఆమెకు పార్టీ జాతీయ నాయకత్వంలో కీలక పదవి దక్కొచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్‌ను ధీటుగా విమర్శించే నాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న డీకే అరుణకు మంచి పదవి ఇస్తే.. ఆమె ద్వారా తెలంగాణలో పార్టీకి మంచి మైలేజీ వస్తుందని భావించిన పార్టీ నాయకత్వం.. డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్షుల జాబితాలో చోటు కల్పించినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక ఏపీ నుంచి బీజేపీ జాతీయ కమిటీలో కేంద్ర మాజీమంత్రి పురంధేశ్వరికి చోటు దక్కింది. ఆమెకు జాతీయ ప్రధాన కార్యదర్శుల జాబితాలో చోటు కల్పించింది బీజేపీ జాతీయ నాయకత్వం. ఏపీలో బీజేపీ అధ్యక్ష పదవిని కాపు సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజుకు కట్టబెట్టిన బీజేపీ.. పురంధేశ్వరికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఉంటే ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టినట్టు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఏపీలో జగన్ సర్కార్‌ను విమర్శించే విషయంలో బీజేపీ కూడా దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా పురంధేశ్వరికి పార్టీలో కీలక పదవి లభించడంతో.. జాతీయ రాజకీయాలతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ ఆమె ముఖ్య భూమిక పోషించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బీజేపీ జాతీయ కమిటీ కీలక పదవి ఆశించిన తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ను పార్టీ ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడిగా నియమించింది బీజేపీ. ఇక ఏపీ నుంచి సత్యకుమార్‌కు జాతీయ కార్యదర్శుల జాబితాలో చోటు దక్కింది. డీకే అరుణ, పురంధేశ్వరి కాకుండా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న తెలుగు రాష్ట్రాల నేతలు లక్ష్మణ్, సత్య కుమార్ మాత్రమే కావడం విశేషం.